Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు పొన్నాల ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ సంపాదించిన దోపిడీ సొమ్ముతో జాతీయ పార్టీ పెడతానంటే నరసింహాస్వామి వరమిస్తాడా? అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. శుక్రవారం హైదరబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను చేసిన అవినీతి, అక్రమాలకు పరిహారం చెల్లించేందుకే ఆయన యాదాద్రికి కానుకలు ఇచ్చారని విమర్శించారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు సీఎం పర్యటన ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అవినీతి కేసీఆర్ చేశారని ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో సొంత విమానం కొనడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ పాలనలో దేవాదుల ప్రాజెక్టులో మూడొ మోటారు ఎందుకు నడపలేదని ప్రశ్నించారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు ఒక్క పైసా మంజూరు చేయలేదనీ, టెక్ట్స్‌టైల్ పార్కు హామీ ఏమైందో చెప్పాలని కోరారు. వరంగల్‌లోని మురికివాడల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. కొద్దో గొప్పో కట్టిన ఇండ్లను లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. వరంగల్‌లో అండ్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి మాట్లాడిన కేసీఆర్...ఇప్పటివరకు ఒక్క పైసా ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు. భద్రకాళి దేవాలయం వద్ద ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. వరంగల్ పర్యటనలో జిల్లా ప్రజలకు వీటిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.