Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి వారిని వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 జైళ్లలో దాదాపు 1,800 మంది జీవిత ఖైదీలుగా మగ్గుతున్నారని తెలిపారు. వారిలో కొంతమంది క్షణికావేశంతో నేరాలకు పాల్పడి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్నారని పేర్కొన్నారు. వారు మానసికంగా మారి సత్ప్రవర్తనతో జైళ్లలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవిత ఖైదీలుగా శిక్షను అనుభవిస్తూ మానసిక క్షోభకు గురవుతూ, వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ మనోవేదన చెందుతున్నారని తెలిపారు. అయితే అనేక ఏండ్లుగా జైళ్లలో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవించిన వారిలో కొందరికి పశ్చాత్తాపం ఉంటుందని పేర్కొన్నారు. ఏటా జాతీయ పర్వదినాలైన గాంధీ జయంతి, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల రోజున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే సాంప్రదాయం ఉందని గుర్తు చేశారు. ఏటా ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ప్రకటించే క్షమాభిక్ష కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ మానవతాదృక్పథంతో సత్ప్రవర్తన కలిగిన, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న జీవిత ఖైదీల విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకుని అర్హులైనవారికి క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు.