Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ
- ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ కూడదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచిం చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐఐహెచ్ఎఫ్డబ్ల్యు కార్యాలయంలో ఐపీఎం, పుడ్‌సేప్టీ విభాగం,ల్యాబ్‌ల పనితీరు, సాధించిన పురోగతిపె అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో దూసుకు పోతున్నదనీ, ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ దేశానికి ఆదర్శంగా నిలవాలనీ, అందుకు తగిన విధంగా పనిచేయాలని సూచించారు. అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు ఇవ్వాలన్నారు. వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలనీ, ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఉత్తమ విధానాలు అనుసరించి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో పర్యటించాలని సూచించారు. అక్కడి విధానాలు అధ్యయనం చేసి నివేదికరూపొందించాలన్నారు. నెలలో రెండు శనివారాల్లో లైసెన్సింగ్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సూచించారు. కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటుందనీ, దాని వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని తెలిపారు. ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడైనా కల్తీ జరిగినా, నాణ్యత లేనట్లు గుర్తించినా వెంటనే 040 21111111 నెంబర్‌కి కాల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. పిర్యాదులు రాగానే అధికారులు వెళ్లి చర్యలు తీసు కుంటారని తెలిపారు. కోర్టు కేసులు పెండింగ్ లేకుండా చూసు కోవాలన్నారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివ లీల, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.