Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత అప్డేట్ కావాలి
- విద్వేష రాజకీయాలకు చోటివ్వొద్దు
- ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాకో మెడికల్ కళాశాల
- వైద్య విద్యకు విదేశాలకు అవసరం లేదు
- వరంగల్ ప్రతిమ ఆస్పత్రి ప్రారంభంలో సీఎం
- వీఆర్ఏల నిరసన.. ప్రజాసంఘాల నేతల అరెస్ట్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
''ప్రపంచ దేశాలకు భారతదేశం అన్నపూర్ణ.. మరోవైపు అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది.. యువత అప్డేట్ కావాలి.. ఇప్పుడు నా వయస్సు 68 ఏండ్లు.. వయస్సు మీద పడుతుంది.. ఈ దేశం మీది.. భవిత మీది..'' అని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా ఆరేపల్లి గ్రామంలో ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజంలో పరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ యువత అప్డేట్ కావాలని సూచించారు. మనకంటే మూడింతలు విస్తీర్ణంలో ఎక్కువగా వున్న అమెరికాలో వ్యవసాయానికి అనుకూలమైన భూములు కేవలం 29 శాతమేనని, మన దేశంలో 50 శాతం భూములు వ్యవసాయానికి అనుకూలంగా వున్నాయని చెప్పారు. చైనా మనకంటే రెండింతలెక్కువగా ఉన్నా వ్యవసాయ యోగ్యమైన భూమి కేవలం 16 శాతమేనన్నారు. మన దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి వుంటే.. ఇందులో 41 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా వుందన్నారు. భిన్నమైన నేలలతోపాటు శీతోష్ణస్థితి అనుకూలంగా వుంటుందన్నారు. 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో వున్నాయన్నారు. ఇవన్నీ వున్నా.. మనం మెక్‌డోనాల్డ్ బర్గర్లు, పిజ్జాలు తింటున్నామన్నారు. ప్రపంచానికే ఆహారాన్నందించే భారత దేశం కొందరు స్వార్ధ ప్రయోజనాల వల్ల తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాజధాని ఢిల్లీలో 13 నెలలకుపైగా రైతులు ధర్నా చేసే దుస్థితి వచ్చిందన్నారు. 'భారత దేశం గొప్ప దేశం.. ఐకమత్యంతో ముందుకెళ్లాల్సిన మన దేశంలో విద్వేషాలకు చోటివ్వొద్దు.. విద్వేష రాజకీయాలను యువత గ్రహించి జాగ్రత్తగా ఉండాలి.. సమాజం చైతన్యవంతంగా ఉండాలి. మేధావులు ముందుండి చైతన్యపర్చాలి'' అన్నారు.
ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా వున్న ముంబయి కంటే తెలంగాణ తలసరి ఆదాయంలో, అభివృద్ధిలోనూ ముందు న్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే తెలం గాణ నెంబర్ వన్ అన్నారు. రాజకీయాలు ఎట్లున్నా కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి తిట్టిపోతరు.. అక్కడ అవార్డులిస్తర న్నారు. 2014కు ముందు 2,800 మెడికల్ సీట్లు రాష్ట్రంలో వుంటే, ఇప్పుడు 6,500 మెడికల్ సీట్లున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. అయినా కొత్తగా 12 కాలేజీలను ప్రభుత్వరంగంలో ప్రారంభించుకున్నామని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో మొత్తం 17 మెడికల్ కాలేజీలున్నాయ న్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ వుండేలా 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేశామన్నారు. అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయితే 10 వేల మెడికల్ సీట్లు మనకు ఉంటాయని చెప్పారు. మన పిల్లలు చైనా, రష్యా, జార్జియా, ఉక్రెయిన్‌కు పోవాల్సిన అవసరముండదన్నారు. పీజీ మెడికల్ సీట్లు గతంలో 1,150 సీట్లుంటే ఇప్పుడు 2,500కు పెంచుకున్నామన్నారు.
జై తెలంగాణ.. జై భారత్..
ప్రసంగం చివర్లో సీఎం కేసీఆర్ జై తెలంగాణ, జై భారత్ అంటూ ముగించడం చర్చనీయాంశంగా మారింది. దసరా పండుగ రోజు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈ కొత్త నినాదమిచ్చి ఇందుకు ఊతమిచ్చారు. ప్రతిమ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు తదితరులను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి.హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్, ధీకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు పసునూరి దయాకర్, ప్రతిమ గ్రూపు సంస్థల చైర్మెన్ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆస్పత్రి డైరెక్టర్లు డాక్టర్ రమేష్, డాక్టర్ అవినాష్, డాక్టర్ ప్రతీక్, డాక్టర్ హారిణి తదితరులు పాల్గొన్నారు.
సూపర్‌స్పెషాలిటీ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
వరంగల్ నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనుల వివరాలను ఆర్అండ్బి శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీఎంకు వివరించారు.
'కెప్టెన్'కు సీఎం పరామర్శ
రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావును సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
వీఆర్ఏల నిరసన
వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‌కు వీఆర్ఏల నిరసన సెగ తగిలింది. సీఎం కేసీఆర్ వస్తున్న క్రమంలో జనగామలో కాన్వారుకి వీఆర్ఏలు అడ్డుగా వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో సీఎం వాహనం దిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికెళ్లిన సీఎంకు వీఆర్ఏలు సమస్యలపై వినతిపత్రం ఇవ్వగా.. తిరిగి వారికే ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కాన్వాయ్ నుండి జారిపడిన మహిళా కానిస్టేబుల్
పెంబర్తి వద్ద సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వాగతం పలికారు. కాన్వాయ్ వెళ్తుండగా వాహనం నుంచి మహిళా కానిస్టేబుల్ జారి కింద పడ్డారు. అయినా ఆమె పరిగెత్తి కాన్వాయ్‌ని అందుకొని తిరిగి అదే వాహనం ఎక్కి వెళ్లడం గమనార్హం.
ప్రజాసంఘాల నేతల అరెస్ట్
సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయమే డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి తదితరులను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గుమ్మడిరాజుల రాజయ్య తదితరులను, ఎన్ఎస్యుఐ, ఎంఎస్ఎఫ్, ఎబిఎస్ఎఫ్, నేతలను అదుపులోకి తీసుకున్నారు.