Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల ఇండ్లకూ పవర్ కట్
- ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్రం
- అక్కడి ఇంచార్జి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్...
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి పూర్తి అంధకారంలోకి వెళ్లిపో యింది. ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఇండ్లకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడి విద్యుత్ ఉద్యోగుల సమ్మెతీవ్రస్థాయికి చేరింది. ఈనెల 27 నుంచి సమ్మెలో ఉన్న అక్కడి విద్యుత్ ఉద్యోగులు తమ డిస్కంను రక్షించుకొనేందుకు శతవిధాలా పోరాడుతున్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో శనివారం ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల నివాసాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. విద్యుత్ సంస్కరణల అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థల్ని ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ఇటీవలి సమావేశాల్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంటు లోపల ప్రతిపక్షాలు, బయట దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు తీవ్ర నిరసనలు తెలుపడంతో ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. కానీ ఈ బిల్లులోని అంశాలను తొలుత కేంద్రపాలిత రాష్ట్రాల్లో అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. దానిలో భాగంగానే పుద్దుచ్చేరి విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ను ప్రయివేటుకు అప్పగించేందుకు కేవలం రూ.27 కోట్లకు అమ్మకానికి పెట్టింది. దానికి సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బిడ్స్‌ను ఆహ్వానించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యుత్ ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. టెండర్లు ఖరారు చేయాలని నిర్ణయించడంతో శనివారం రాత్రి నుంచి పుదుచ్చేరి విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సరఫరాను నిలిపివేశారు. దీనితో ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఇండ్లూ అంధకారంలోకి వెళ్లిపోయాయి. మరో కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలు) ఇప్పటికే ప్రయివేటీకరించారు. ఇప్పుడు అక్కడి డిస్కంలు అదానీ, టాటాల చేతుల్లో ఉన్నాయి. అర్థరాత్రి దాటినా పుదుచ్చేరి రాష్ట్రం అంధకారంలోనే ఉంది. ఈ డిస్కంను 2021 నవంబర్లోనే ప్రయివేటీకరించే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. ఆ తర్వాతి ఎన్నికల్లో బీజేపీ సంకీర్ణప్రభుత్వం అధికారంలోకి రాగానే డిస్కంల ప్రయివేటీకరణను వేగవంతం చేసింది. పుదుచ్చేరికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో ఇక్కడి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలనూ వ్యతిరేకిస్తూ మీడియాలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇంచార్జి గవర్నర్‌గా తమిళిసై ఉన్న పుదుచ్చేరిలో పరిస్థితులు ఇప్పుడు టీఆర్ఎస్కు బలమైన రాజకీయ ఆయుధంగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం గవర్నర్ విదేశీపర్యటనలో ఉన్నారు.
సంఘీభావంగా...
పుదుచ్చేరి విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయాస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపు మేరకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) ఆధ్వర్యంలో శనివారం మింట్‌కాంపౌండ్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దానిలో భాగంగానే విద్యుత్‌రంగాన్ని కూడా ప్రయివేటీకరిస్తున్నారని చెప్పారు. పుదుచ్చేరి విద్యుత్ ఉద్యోగులు ఒంటరి కాదనీ, వారివెంట దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పీ సదానందం, వెంకట నారాయణరెడ్డి, అంజయ్య, పీవీ రావు, పవన్‌కుమార్, ప్రశాంత్, వేణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.