Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోచంపల్లిలో నాలుగెకరాల భూమి కబ్జా
- నాటి ఎమ్మార్వో చేసిన తప్పిదం
- రికార్డుల్లో పేరు మార్చకపోవడంతోనే ఆక్రమణ
- నెరవేరని మంత్రి కేటీఆర్ హామీ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఆ ఊరి పేరు వింటేనే ఓ చైతన్యం.. ఓ కళానైపుణ్యం.. ప్రపంచంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా.. నేతన్న నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది.. అలాంటి అక్కడ నేతన్నల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది.. నాటి ఎమ్మార్వో చేసిన తప్పిదం వల్ల భూయజమాని కొడుకే నేడు ఆక్రమించుకున్నాడు.. దాంతో 'నేత బజార్' పునాదుల్లోనే ఆగిపోయింది. అదే భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రం. ఆచార్య వినోభా బావే మార్గదర్శకంలో పయనించి దేశంలోనే మొదటిసారిగా తన సొంత భూమిని దానం చేసిన వెదిరె రాంచంద్రారెడ్డి ఈ పట్టణానికి చెందిన వ్యక్తి. ఆయన దాతృత్వానికి గుర్తుగా హైదరాబాద్- విజయవాడ రహదారిపై విగ్రహాన్ని నెలకొల్పారు. అలాంటి వ్యక్తి పుట్టిన ఈ ప్రాంతంలో.. ఆ మహానుభావుడి రక్త సంబంధీకుడే యథేచ్ఛగా భూ కబ్జా చేశారు.
పోచంపల్లి వస్త్రాలకు దేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. తమ చేతి కళానైపుణ్యంతో నేత కార్మికులు వస్త్రాలను తయారు చేస్తున్నారు. పట్టుచీరలు, కాటన్ వస్త్రాల తయారీకి పోచంపల్లి పెట్టింది పేరు. అంత గొప్పగా పేరున్న ఈ పట్టణంలో చేనేత కార్మికులకు ప్రత్యేక మార్కెట్ బజార్ లేదు. దాంతో చేనేత కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అనేకసార్లు స్థానిక చేనేత సంఘం నాయకులు, కార్మికులు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన నాటి ప్రభుత్వం రైతు బజారు మాదిరిగానే నేత బజార్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
నేత బజార్‌కు స్థలం కేటాయింపు
చేనేత వస్త్రాలను అమ్ముకోవడానికి అవసరమైన మార్కెట్ సౌకర్యం పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2003లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, పోచంపల్లి మండల కేంద్రంలో 'నేత బజార్' ఏర్పాటుకు సంకల్పించారు. నాటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి జోక్యం చేసుకుని మార్కెట్‌కు అవసరమైన నాలుగెకరాల భూమిని ఎంపిక చేశారు. సర్వే నెంబర్ 419, 420, 433లో వెదిరె రామచంద్రారెడ్డి కుమారుడు జితేందర్‌రెడ్డి నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ సమయంలో భూమి ఖరీదు రూ.5లక్షలు చెల్లించారు. ఆ తర్వాత నేత బజార్ కోసం శంకుస్థాపన చేశారు. అదే సందర్బంలో దాదాపు 20లక్షల నిధులు కూడా విడుదల చేశారు. పునాది, పిల్లర్లు నిర్మాణం చేపట్టారు. ఈ పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
శిలాఫలకం ధ్వంసం
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేత బజార్‌ను ఎవరూ పట్టించుకోలేదు. పనులు ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. ఏండ్లు గడిచిపోయాయి.. ఇదే అదునుగా భావించిన భూ కబ్జాదారులు 2009లో శిలాఫలకాన్ని ధ్వంసం చేసి స్థలాన్ని ఆక్రమించుకున్నారు. వాస్తవంగా భూమిని కోనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. కానీ నాటి ఎమ్మార్వో రెవెన్యూ భూరికార్డులు మారిస్తే సరిపోతుందని చెప్పారు కానీ రికార్డులు సరిచేయలేదు.
దాంతో అధికారికంగా ఎక్కడా చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుగా రికార్డులు లేవు. దీంతో ఆ భూమిని అమ్మిన యజమాని కుమారుడు తమదే భూమి అంటూ కబ్జా చేశాడు. ఈ విషయంపై చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డైరక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. దాంతో కబ్జాదారుడు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నేత బజార్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది.
సిరిసిల్ల నేత బజార్ వస్త్ర వ్యాపారాలతో కళకళలాడుతుండగా.. పోచంపల్లిలో కేటాయించిన స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించుకోవడంతో ఇక్కడ నేటికీ నేత బజార్ రూపుదిద్దు కోలేదు. పోచంపల్లి చేనేత కార్మికులు వేల సంఖ్యలో ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. సొంత ఇల్లు లేకున్నా కిరాయి ఇంటిలో ఉంటూ కూలికి నేస్తూ జీవనం సాగిస్తున్నారు. కనీస ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కార్మికులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చేనేత కార్మికుల బతుకులు మారుతాయని ఆశించిన నేతన్నల ఆశలు ఆవిరయ్యాయి.
నేరవేరని మంత్రి కేటీిఆర్ హామీ
అధికారంలోకి వచ్చిన మొదట్లో త్రిప్టు పథకాన్ని ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్ పోచంపల్లి కేంద్రానికి వచ్చారు. కబ్జాకు గురైన నేత బజార్‌ను పునరుద్ధరించి, మార్కెట్ సదుపాయం కల్పించాలని ఆ సందర్బంలో నేతన్నలంతా విన్నవించుకున్నారు. కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అక్కడికక్కడే నాటి కలెక్టర్‌కు సంబంధిత విషయమై ఆదేశాలు జారీచేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఏండ్లు గడుస్తున్నా చేనేత కార్మికుల గోడు తీరలేదు. నేత బజారు పునాదిలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోచంపల్లిలో నేత బజార్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రిజిస్ట్రేషన్ చేయకుండా కుట్రలు
వెదిరె రామచంద్రారెడ్డి కుమారుడి నుంచి భూమి కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం రూ.5లక్షలు చెల్లించింది. భూమిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించు కోవాల్సి ఉంది కానీ చేయలేదు. దాని స్థానంలో పత్రాలను చేనేత ప్రతినిధులకు ఇచ్చారు. అప్పటి ఎమ్మార్వో శ్రీనివాస్ రికార్డులో పేరు మారిస్తే సరిపోతుందని చెప్పారు. కానీ చూస్తే పేరు మార్చలేదు. రిజిస్ట్రేషన్ చేయకుండా రికార్డుల్లో పేరు మారిస్తే సరిపోతుందనే ఆలోచన రావడమే అప్పుడు కుట్రకు తెరలేపినట్టుగా ఉంది.
- ఏలే బిక్షపతి, చేనేత కార్మిక సంఘం నాయకులు
నేత బజార్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి
ఉమ్మడి రాష్ట్రంలో పోచంపల్లి చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు వీలుగా అక్కడ నేత బజార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కొనుగోలు చేసిన నాలుగెకరాలను కబ్జాదారులు ఆక్రమించారు. వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ నిధులతో మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ముడిసరుకులను సబ్సిడీ ద్వారా చేనేత కార్మికులకు అందించాలి. వ్యక్తిగత రుణాలు అందించి చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
- కోడే బాల నర్సింహ, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు పోచంపల్లి