Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ-వెంకటాపురం
పనికి తగిన ఫలితం కావాలి.. కూలి రేటు పెంచాలని కోరుతూ కూలీలు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. రెండు సార్లు చర్చలు జరిపినా స్పందన రాకపోవడంతో శనివారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా రోజు వారీ కూలి రేటు రూ.311కు పెంచాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 9 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రైతు కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో లేబర్ కమిషన్ అధికారి వినోద, తహసీల్దార్ నాగరాజు ఇప్పటి వరకు రెండు సార్లు చర్చలు జరిపినప్పటికీ కూలి రేటు పెంచేందుకు ఆ గ్రామ రైతులు సహకరించలేదు. ఈ క్రమంలో శనివారం కూలి పనులకు వెళ్తున్న కొందరు కూలీలను తోటి కూలీలు అడ్డుకున్నారు. కూలి రేటు పెంచేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కూలీలతో ఎస్ఐలు తిరుపతి, అశోక్, తహసీల్దార్ చర్చలు జరిపారు. కూలి రేటు పెంపుపై ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో రైతులతో చర్చలు జరుపుతామని హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గ్యానం వాసు, వంకా రాములు, కుమ్మరి శ్రీను, అదినారాయణ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.