Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకుల్లో వెలుగులు నింపుకుందాం
- శ్రామికవర్గ ఐక్యతను చాటుదాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-అడిక్‌మెట్
బతుకమ్మలోని సుసంస్కృతిని కాపాడుకొని, బతుకుల్లో వెలుగులు నింపుకుందామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేష్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణలో బతుకమ్మ అంటే ఒక కవిత, కావ్యం, బతుకు కదా అన్నారు. భూస్వాముల దురాగతాలకు నిలదీత ఈ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మ అంటే ఉత్సవం కాదని ఉద్యమం అని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పల్లెపల్లెనూ తట్టిలేపింది అని కొనియాడారు. బతుకమ్మ అంటే సకలజనులు ఆడుకునే పండుగన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను ప్లాస్టిక్ బతుకమ్మగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాల నోటి వెంట నుంచి దశాబ్దాలుగా బతుకుతూ వచ్చిన బతుకమ్మ పాటను సినిమా పాటగా మార్చారని ఆవేదన చెందారు. పాలకులు ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ.. బతుకమ్మ సహజత్వాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నార న్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కో కన్వీనర్ పద్మశ్రీ, రోజా రాణి, సుజాత, భారతి, సువర్ణ, లక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.