Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ విద్యావిధానంతో దేశం బలోపేతమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. శనివారం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం ఛాన్సలర్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన 22వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం ఆర్థికంగా బలోపేతమైందనీ, ఇటీవల యుకెను దాటేసిందని గుర్తుచేశారు. భారత్‌ను ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా నిలిపేందుకు నూతన జాతీయ విద్యా విధానం తోడ్పడనుందని తెలిపారు. ఈ విధానం విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దనున్నదని చెప్పారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ పరిశోధనలకు ప్రధాని మోడీ ఇస్తున్న ప్రోత్సాహానికి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కేవలం 11 నెలల్లోనే అందించగలిగామని చెప్పారు. మన మూలాలను మరువొద్దని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె స్వామి వివేకానంద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తదితర మహనీయులు జీవితాని గురించి చెప్పిన సూక్తులను ఉటంకించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ తదితరులు పాల్గొన్నారు. మూడేండ్లలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలను అందజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు డోనర్ల అవార్డులను అందుకున్నారు.