Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీ జయంతికి కూడా క్షమాభిక్షపై విడుదల లేనట్టే
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :క్షమాభిక్షపై విడుదలవుతామనుకున్న ఖైదీల ఆశలపై సర్కారు మరో సారి నీళ్లు చల్లింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజైనా తాము విడుదలవుతామని ఆశలు పెట్టుకున్న అనేక మంది ఖైదీలకు తిరిగి నిరాశే మిగిలింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను పురస్కరించుకొని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా అర్హులైన ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేస్తామని ప్రభుత్వం మూణ్నేళ్ల కింద ప్రకటించింది. అందుకు తగిన మార్గదర్శకాల ప్రకారం క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖను ఆదేశించింది. ఆ మేరకు 75 మంది అర్హులైన ఖైదీల విడుదల కోసం జైళ్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించింది. ఆ నివేదికను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ జాబితాను గవర్నర్ అనుమతి కోసం గత ఆగస్టు మొదటి వారంలో పంపింది. ఇక పంద్రాగస్టున 75 మంది ఖైదీలను విడుదలకు అనుమతిస్తూ గవర్నర్ ఆమోదంతో ఉత్తర్వులు వెలువడుతాయని అందరూ ఎదురు చూశారు. ముఖ్యంగా ఖైదీల కుటుంబ సభ్యులు చంచల్గూడ, చర్లపల్లి కేంద్ర కారాగారాల వద్ద చకోరా పక్షుల్లా ఎదురు చూశారు. స్వాతంత్య్ర దినం గడిచిపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఖైదీల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో ఇటు ఖైదీలు, అటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు.