Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలాంటి ప్రయత్నాలతో ఆయన ప్రతిభ తగ్గదు...
- మౌనం వీడండి.. చెడును ఖండించండి...
- మేధావులారా.. ఏం జరుగుతున్నదో ఆలోచించండి : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మరుగుజ్జులు ఏ నాటికీ మహాత్ములు కాలేరంటూ బీజేపీ, ఆరెస్సెస్ నేతలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. జాతిపిత గాంధీజీపై వారు చేస్తున్న కామెంట్లు, చర్యలు చరిత్రలో వెకిలిగానే మిగిలిపోతాయంటూ హెచ్చరించారు. కొన్ని చిల్లర మల్లర శక్తులు సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి వెకిలి చర్యల వల్ల మహాత్ముడి కృషి, ప్రతిభ ఏనాడూ తగ్గదంటూ ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలోని మేధావులందరూ తమ కండ్ల ముందు ఏం జరుగుతున్నదో చూడాలని విజ్ఞప్తి చేశారు. వారి మౌనం సమాజానికి మంచిది కాదనీ, చెడును ఖండిచాల్సిందేనంటూ సీఎం పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డుతోపాటు గాంధీ దవాఖానా వద్ద ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. అనరతరం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ... గాంధీజీకి ఘన నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన నిర్వహించిన పోరాటాలను, త్యాగాలను స్మరించుకున్నారు. 'తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను అందరూ ఈ బక్కపలచనోడు ఏం చేస్తాడు..? వీడితో ఏమైతది...' అంటూ చాలా మంది అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సందర్భాల్లో తాను గాంధీ గారినే తలుచుకుని.. ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లేవాడినని వివరించారు. అయితే అంతటి గొప్ప మహాత్ముడినే నేడు కొందరు కించపరుస్తున్నారని విమర్శించారు. బాపూజీపై వారు చేసే వ్యాఖ్యలు వింటుంటే తన హృదయం బాధపడుతుంది.. రక్తం మరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మేధావులు మౌనాన్ని వీడి తప్పులు చేసే వారిని విమర్శించాలని సూచించారు. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వివరిం చారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్‌బహుదూర్ శాస్రి జయంతి సంద ర్భంగా సీఎం నివాళులర్పించారు. ఆయన జై జవాన్.. జై కిసాన్ అంటూ నినదించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు జవాన్ అనేవాడు అగ్నిపథ్‌లో రగిలిపోతున్నాడనీ, పంటలకు మద్దతు ధరల్లేక కిసాన్ ఆత్మ హత్య చేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నివారిం చాల్సిన కేంద్ర పాలకులు... అందుకు భిన్నంగా దుర్మార్గ ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి శాశ్వతంగా ఉండబోదనీ, అది తాత్కాలికమేనని స్పష్టం చేశారు. కార్యక్ర మంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, హరీశ్‌రావు, శ్రీనివాస గౌడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సుభాష్‌రెడ్డి, స్టీఫెన్సన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తోపాటు పలువురు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.