Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఇచ్చినా మారని తీరు
- నాణ్యత పేరుతో చేసిన వ్యాఖ్యలపై మండిపాటు
- ప్రతిపాదిత ప్రాంతాల అననుకూలతపై సెయిల్, మెకాన్ల అభ్యంతరాలు
- స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై ఎనిమిదేండ్లుగా వీడని చిక్కుముడి
బయ్యారంలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు అంశం ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 13వ క్లాజ్‌లో ఖమ్మం జిల్లాలో రూ.30వేల కోట్ల వ్యయంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నా ఎనిమిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది. ఇప్పుడు ప్రతిపాదిత ప్రాంతాల్లోని అననుకూలతను సాకుగా చూపి.. మొత్తానికే ఈ పరిశ్రమ ఊసే లేకుండా చేసేందుకు యత్నిస్తోంది. దీన్ని బలపరుస్తూ స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యమే కాదనే రీతిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్థానికులు, బీజేపేతర పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశవ్యాప్తంగా ఇనుప ఖనిజ నిల్వల్లో 12శాతం బయ్యారంలోనే ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గతంలోనే నిర్ధారించింది. బయ్యారం, గార్ల, భీమదేవరపల్లి, నేలకొండపల్లిలో లభించే ఇనుప ఖనిజంలో బయ్యారందే అగ్రస్థానమని గుర్తించింది. మిగతా ప్రాంతాల్లో కంటే ఇక్కడ 80శాతం ఎక్కువగా నిక్షిప్తమై ఉందని పేర్కొన్నది. అయినా కేంద్రప్రభుత్వం ప్రతిపాదిత స్థలాల్లో అననుకూలతలను సాకుగా చూపి హామీని విస్మరించే ప్రయత్నం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాధ్యాసాధ్యాలపై పూటకో మాట...
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్రప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతోంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ద్వారా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని 2014లో ఆ సంస్థ బృందాన్ని బయ్యారం పంపింది. ఇక్కడ పర్యటించి కర్మాగారం ఏర్పాటుకు 200 మిలియన్ టన్నుల ముడి ఖనిజం కేటాయించాల్సి ఉందంటూ నివేదిక సమర్పించింది. ఆ తర్వాత జీఎస్ఐ మదింపు చేసి స్థానికంగా అందుబాటులో ఉన్న ముడి ఇనుప ఖనిజం నాణ్యత, పరిమాణం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సరిపోదని చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కుశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటైంది. అది స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై రిపోర్టు బాధ్యతను మెటలర్జికల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ (మెకాన్)కి అప్పగించింది. బయ్యారం మండలం ధర్మాపురం, గార్ల మండలం శేరిపురం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు కాదని రాంచీకి చెందిన ఈ మెకాన్ సంస్థ నివేదించింది. కొండలు, గుట్టలు ఉండటం, రక్షిత అటవీ ప్రాంతం కావడంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువుగా లేదని తేల్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచి ముడి ఇనుప ఖనిజం తరలింపునకు రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా కేంద్రం ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదనడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి ఖనిజం నాణ్యత 45 ప్లస్ అని నిపుణులు తేల్చినా కేంద్రం నాణ్యతాప్రమాణాలను సాకుగా చూపి వెనకడుగు వేస్తుండటంపై ఏజెన్సీ వాసులు మండిపడుతున్నారు.
నాణ్యత లేదనడం హాస్యాస్పదం
బయ్యారం ముడి ఇనుప ఖనిజం నాణ్యత లేదని కేంద్రమంత్రి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. నాణ్యత లేకుంటేనే ప్రయివేటు కంపెనీలు దారి కడుతున్నాయా. ఇప్పటికే 200 కంపెనీలు ఇక్కడి ఇనుప ఖనిజం కోసం అప్లికేషన్లు పెట్టాయి. గతంలో సీఎంసీ, భాస్కర్‌రావు, లాల్ అండ్ లాల్ కంపెనీలు మైనింగ్ నిర్వహించి ఖనిజాన్ని ఎగుమతి చేసి లాభాలు గడించాయి. ఆమోద కంపెనీ 2010 వరకు మైనింగ్ నిర్వహించి లక్షల టన్నుల ఖనిజాన్ని ఎలా తీసుకెళ్లింది. నాణ్యత లేకుంటేనే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40వేల ఎకరాల ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్‌కు ఎలా కేటాయించారు. 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బయ్యారం ఖనిజాన్ని విశాఖ స్టీల్స్‌కు ఎందుకు కేటాయించినట్టు. బయ్యారం ఉక్కుపై బీజేపీ మొదటి నుంచి ప్రతికూల వైఖరీతోనే వ్యవహరిస్తుండటం దుర్మార్గం.
- గౌని ఐలయ్య, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటీ కన్వీనర్
తప్పుడు వ్యాఖ్యలు కట్టిపెట్టి...ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలి..
కేంద్రమంత్రి తప్పుడు వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు ఇక్కడున్న అనుకూలతలను కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ మౌలిక సదుపాయాలెన్నో ఉన్నాయి. పక్కనే సింగరేణి బొగ్గు, డోలమైట్ ఖనిజం లభిస్తుంది, బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్ చేసుకుని నీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. మూడు కి.మీ దూరంలోని గార్ల నుంచి రైల్వేలైన్ కూడా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదైనా చొరవ తీసుకుని ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాయని ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గిరిజనులు, నిరుద్యోగులు ఆశతో ఉన్నారు. వారి ఆశలకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
- మండా రాజన్న, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటీ కో-కన్వీనర్