Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకం కాబట్టే గాంధీని గాడ్సే చంపాడు
- ప్రశ్నించేతత్వం బతికుందంటే కమ్యూనిస్టులే కారణం: మహాత్ముడు మతసామరస్యం సెమినార్లో జీవశాస్త్రవేత్త, ప్రొఫెసర్ దేవరాజు మహారాజు
- వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జాతిపిత గాంధీ స్థానాన్ని సావర్కర్తో భర్తీ చేయలేదని జీవశాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత, ప్రొఫెసర్ దేవరాజు మహారాజు నొక్కిచెప్పారు. ఎప్పటికీ గాంధీనే దేశానికి జాతిపిత, మహాత్ముడు అని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి బీజేపీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను, చరిత్ర వక్రీకరణను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'మహాత్ముడు:మతసామరస్యం' అనే అంశంపై అయన మాట్లాడారు. గాంధీ విషయంలో కొన్ని అంశాల్లో వైరుధ్యాలున్నప్పటికీ స్వాతంత్య్రం కోసం దేశ ప్రజలందర్నీ, అన్ని మతాలనూ ఏకం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఎవరి విశ్వాసాలు వారివనీ, దేశ స్వాతంత్య్రం కోసం అన్ని మతాల వారూ కలిసి రావాలని కోరి సఫలమైన ఆయన బెస్ట్ పొలిటికల్ కో-ఆర్డినేటర్ అని ప్రశంసించారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం అన్ని మతాల వారూ కలిసికట్టుగా పోరాడితే...నేడు బీజేపీ మతాల పేరిట ప్రజల్ని విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని విమర్శించారు. మతం ఆధారంగా ఆనాడు పాకిస్థాన్ విడిపోయిందనీ, మతఘర్షణలతో ప్రజలు చావకూడదనే విభజనకు గాంధీ మద్దతు తెలిపారని వివరించారు. గాంధీ మతాన్ని పూర్తిస్థాయిలో డీల్ చేయలేక మెతక వైఖరి అవలంబించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అస్పృశ్యతనూ వ్యతిరేకించి దళితులను హరిజనులు అనాలంటూ పిలుపునిచ్చారన్నారు. అయితే, పేరు మార్చి పిలిచినప్పటికీ భారతీయ సమాజంలో వారి పట్ల ఉన్న వైఖరి, జీవన విధానం మారలేదని చెబుతూ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో స్వాతంత్రోద్యమ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను వివరించారు. ద్వేషాన్ని ప్రేమతో జయించాలనీ, అబద్ధాన్ని సత్యంతో నిరూపించాలనీ, హింసకు స్వస్తిచెప్పి అహింసతో సాధించాలని గాంధీ చెప్పిన విషయాలను ప్రస్తావించారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై అగ్రరాజ్యాల దాడిని ఆయనెప్పుడూ ఖండించేవారన్నారు. ఒకరినొకరు దోచుకునే పద్ధతి ఉండొద్దని ఆకాంక్షించారని చెప్పారు. స్వార్ధపూరిత రాజకీయాలను ఆయన తిరస్కరించేవారన్నారు. గాంధీజీ చెప్పినవన్నీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. అందుకే ఆర్ఎస్ఎస్ అగ్రనేతల ఆశీర్వాదాలను తీసుకుని పక్కా ప్లాన్‌తో గాంధీని గాడ్సే కాల్చిచంపిన తీరును వివరించారు. నేడు ప్రజల మెదళ్లలో మతం పేరిట ద్వేషాన్ని నింపి ఆ పార్టీ బలపడుతున్నదని విమర్శించారు. సంపద కొద్ది మంది చేతుల్లో ఉండాలనే మనువాద ధర్మాన్ని బీజేపీ అనురిస్తున్నదనీ, అందులో భాగంగానే దేశసంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని అన్నారు. హేతువాదులు, ప్రజాస్వామిక వాదులు, కమ్యూనిస్టులు బీజేపీ వైఖరిని ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. నేటికీ దేశంలో ప్రశ్నించేతత్వం బతికి ఉందంటే దానికి కమ్యూనిస్టులే కారణమన్నారు. వామపక్షాలు మరింత ప్రజలకు చేరుకావాలనీ, యువతలో ప్రశ్నించేతత్వాన్ని మరింత పెంచాలని ఆకాంక్షించారు. శాస్త్రీయ దృక్పథం అనే పదాన్ని పరిచయం చేసింది ప్రథమ ప్రధాని నెహ్రునే అని నొక్కిచెప్పారు. 18 ఏండ్ల పాటు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలోని 90 శాతానికిపైగా వైజ్ఞానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పురుడుపోసుకున్నాయని చెప్పారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకున్న నెహ్రుని తక్కువ చేసి చూపెట్టడానికి ఆర్ఎస్ఎస్ శక్తులు విష ప్రచారానికి పూనుకున్నాయని విమర్శించారు.
పటేల్ పల్లవి ఎత్తుకోవడం అందులో భాగమేనన్నారు. దేశ ప్రజలు ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని ఆందోళన వెలిబుచ్చారు. బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవల గాంధీపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ అధ్యక్షత వహించగా ఆ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, టీపీఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.