Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేస్తున్నదనీ, దాని నుంచి ప్రజలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు, పోతినేని సుదర్శన్ రావు, జి.నాగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలు, సర్వీసులను ప్రయివేటీకరించుకుంటూ పోతున్నదని విమర్శించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనాలు రూ.26 వేలు, పెన్షన్ రూ.10 వేలివ్వాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విస్తరింపజేసి పని దినాలను 200 రోజులకు పెంచాలనీ, కనీస వేతనం రోజుకు రూ.600 ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలన్నింటినీ తక్షణమే చెల్లించాలనీ, జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. కనీస మద్ధతు ధరల చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి రైతులు, వ్యవసాయ కార్మికులందరికీ బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ చట్టం తేవాలన్నారు. 60 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ ఇవ్వాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలనీ, ఆహార పదార్థాలపై నిత్యావసరాలపై ప్రభుత్వం విధించిన జీఎస్టీని ఉపసంహరించు కోవాలని కోరారు. పెట్రోల్, డీజీల్, కిరోసిన్, వంటగ్యాస్‌లపై కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలనీ, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో విద్యా,వైద్య వ్యవస్థలను బలోపేతం చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడారు.