Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశేష స్పందన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిందాబాద్ మాజీ ప్రధాన కార్యదర్శి టీఎన్వీ రమణ స్మారక ఉచిత వైద్య శిబిరం ఆదివారం హైదరాబాద్ బాగలింగంపల్లిలోని హైదరాబాద్ జిందాబాద్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్ టెస్ట్‌లు, డాక్టర్ కన్సల్టేషన్, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమణ.. అనేక ఉచిత వైద్య శిబిరాలు, పర్యావరణ ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఆయన స్మారకంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ వైద్య శిబిరంలో 150 మంది బీపీ షుగర్ టెస్ట్‌లు చేయించుకున్నారు. అనంతరం రిపోర్టుల ఆధారంగా డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. రోగులకు జనరిక్ మెడిసిన్‌ను కార్యకర్తలు అందజేశారు. ప్లానెట్ ఆప్టిక్ ఐ క్లినిక్ నుంచి అనిల్ నాయకత్వంలోని బృందం 160 మందికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళ అద్దాల పత్రాలను అందజేశారు. ఈ వైద్య శిబిరంలో 120 మందికి కళ్ళద్దాలు అవసరమైనట్టు గుర్తించారు. దాతలు ముందుకొస్తే రోగుల కొలతలకు అనుగుణంగా అనుగుణంగా కళ్లద్దాలు తయారు చేయించి అందజేస్తామని హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య తెలిపారు. ఈనెల 16వ తేదీన కంటి పరీక్షలు చేసిన వారికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి, ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ నాయకులు ఎం.శ్రీనివాసరావు, పి.నాగేశ్వరరావు, టి.నాగేష్, పి.శ్రీనివాసరావు, మోహన్, సైదులు, రాజమౌళి, కె.లలిత, సంగీత, శ్రీవల్లి, అస్మిత, గోపాల్ పేషంట్లకు సేవలు అందించారు.