Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి
- తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో..
- గోల్కొండ కోటలో బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ-ధూల్‌పేట్
బతుకమ్మను బతుకనివ్వాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ అన్నారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోట ప్రాంతంలో బతుకమ్మ సంబురాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడపిల్లలపై, మహిళలపై జరుగుతున్న లైంగికదాడులను ఏ ప్రభుత్వం కూడా ఆపలుకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకని ప్రతి ఒక్క మహిళా ఈ బతుకమ్మ ఆటతో స్ఫూర్తిని తీసుకొని పోరాడాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగని ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నటువంటి విషయం తెలిసిందేనన్నారు. 'బతుకమ్మ ఎందుకు జరుపుకుంటున్నాం, బతుకమ్మను ఎందుకు ఆడుతున్నాం' విషయాన్ని స్పష్టంగా వివరించారు. 'బతుకు అమ్మ.. ఆడపిల్లని బతుకనిద్దాం.. ఎదగనిద్దాం.. చదివినిద్దాం' నిదానంతో బతుకమ్మ ఆడుతున్నారన్నారు. తెలంగాణలో చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం బతుకమ్మ పాట తోటి నైజాం దేశముఖ్లను తరిమేసినటువంటి వీరవనితలన్నారు. ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని కోరారు. అనంతరం తోటి ఆడపడుచులు అంతా ఒకే దగ్గర చేరి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షులు శ్రావణ్ కుమార్, శ్రామిక మహిళ నగర కార్యదర్శి మీనా, ఐద్వా నగర అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మమ్మ, శశికళ, పట్నం నగర కార్యదర్శి కోటయ్య, ఐద్వా నగర నేతలు లావణ్య, సంధ్య, జ్యోతి, లక్ష్మమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.