Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ఆర్థిక అసమానతలు
- త్వరలోనే హైదరాబాద్లోని దళిత, గిరిజన బస్తీల్లో పర్యటన :
సీఎల్పీ నేత భట్టి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
బీజేపీ, టీఆర్ఎస్లు మహాత్మాగాంధీ ఆలోచనలకు భిన్నంగా పాలన సాగిస్తున్నా యని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు.వాటి పాలనలో స్వేచ్ఛ, సమానత్వం లేకుండా ప్రజలు అనేక సమస్యలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్లోని దళిత, గిరిజన బస్తీల్లో ప్యటించనున్నట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని మీడియాపాయింట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. గాంధీని పూజిస్తున్నామని చెబుతున్న బీజేపీ నేతలు...ఆయన ఆలోచనలు, సిద్ధ్దాంతాన్ని ఆచరణలో అమలు చేయడం లేదని విమర్శించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక ఆసమానతలు లేని భారత సమాజ నిర్మాణాన్ని గాంధీ ఆశించారనీ, దాన్ని బీజేపీ తుంగలో తొక్కుతున్నదని చెప్పారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం ఇద్దరు వ్యాపారులు మాత్రమే ప్రపంచ కుబేరులుగా ఎదిగారని చెప్పారు. ఆనాడు హిందూ, ముస్లిం భాయి...భాయి అంటూ జాతిని ఏకం చేస్తే, ఆ పార్టీ దేశాన్ని మత ప్రాతిపదికగా విభజించేందుకు కుట్రలు చేస్తున్నదని చెప్పారు. రాజకీయాల్లో మతాన్ని జొప్పించి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. గాంధీ ఆలోచనా విధానంతోనే జాతిని ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారనీ, ఇది దేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణలో జరగబోయే రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు కలిసి పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పేరు తెరమీదకు రావడంతో బీజేపీ నేతలకు భయం పట్టుకుందనీ, అందుకే ఆయన్ను ఒక కులానికి పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వంత పాడుతున్న మీడియాతో ఆయనపై విషపూరిత ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్ష పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా తన నామినేషన్ ఉపసంహరించుకుని ఆయనకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
వీఆర్ఏలకు దసరా కానుక ఇవ్వాలి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడం ద్వారా దసరా కానుక ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వారికి పే స్కేల్ పెంచాలనీ, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వారికి జీతాలు చెల్లించడం లేదనీ, ఒత్తిడి తట్టుకోలేక 28 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.