Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ యోచన
- దసరా మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రకటన..?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు.. ఇప్పుడున్న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఆదివారం ఆయన పార్టీ సీనియర్లతో నిర్వహించిన భేటీ అత్యంత చర్చనీయాంశమైంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి.. నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుత టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారిస్తే పార్టీ జెండా, ఎన్నికల గుర్తుతోపాటు సాంకేతికంగా ఎలాంటి ఇతర ఇబ్బందుల్లేకుండా చూడాలని సీఎం సూచించినట్టు సమాచారం. దసరా పండుగ రోజైన బుధవారం నిర్వహించబోయే టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయా అంశాలపై మరింత లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మెన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సహా మొత్తం 283 మంది ఆ సమావేశానికి హాజరు కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ను పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది.