Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక హక్కుల ఉద్యమంలో కీలక పాత్ర
- జెండావిష్కరణలో టీ సాగర్, స్కైలాబ్‌బాబు
- ఘనంగా 24వ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమానత్వ సమాజ సాధనే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) లక్ష్యమనీ, సామాజిక హక్కుల పోరాటాల్లో అది కీలకపాత్ర పోషించడం అభినందనీయమని కేవీపీఎస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు టి. సాగర్ అన్నారు ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌బాబు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన సాగర్ మాట్లాడుతూ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్యాల సాధన కోసం సంఘం ఏర్పడిందన్నారు. మహాత్మజోతిభాపూలే, భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆకాంక్షల కోసం పోరాడుతున్నదని చెప్పారు. 24 ఏండ్ల ప్రస్థానంలో అనేక పోరాటాలను నిర్వహించిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిందని గుర్తు చేశారు. స్మశాన వాటిక స్థలాలకు సంబంధించిన జీవోనెంబర్ 1235ను సాధించిందని తెలిపారు. కులవివక్ష, అంటరానితనం, అసమానతలపై రాజీలేని ఉద్యమాలు నడిపిందని చెప్పారు. కుల దురహంకార దాడులు, హత్యలు ఎక్కడ జరిగినా ముందుండి పోరాడుతున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు నేడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ...మతోన్మాద విధానాలతో దళితులపై దాడులకు పాల్పడుతుందని చెప్పారు. అనేక రూపాల్లో సామాజిక అణిచివేత, దాడులు, దౌర్జన్యాలు, హత్యలను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారని చెప్పారు. భారత రాజ్యాంగంపై ముప్పేట దాడి చేస్తూ దళితులకు రిజర్వేషన్ల ఫలాలు అందకుండా ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటుపరం చేస్తూ వారిని అన్ని రంగాలలో నిరాశ్రయుల్ని చేసిందన్నారు. మరోవైపు నిరుద్యోగాన్ని పెెంచి పోషించేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. వాగ్దానాలు ఇవ్వడం తప్ప వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. ఎస్సీలకు ఇస్తామన్న మూడెకరాల భూమి, ప్రస్తుతం ఇస్తున్న దళితబంధు పథకం అమలులో ప్రభుత్వ నిర్వాకం తేటతెల్లమవుతున్నదని చెప్పారు. దళితులంతా ఐక్యంగా నిలిచి అంబేద్కర్, ఫూలే ఆశయాల సాధన కోసం కేవీపీఎస్ నిర్వహిస్తున్న ఉద్యమాల్లో పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.