Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేతల అరెస్టుకు పోలీసుల యత్నం... అడ్డుకున్న ఉద్యోగులు
- రాష్ట్రంలో పర్యటించిన ఎన్సీసీఓఈఈఈ ప్రతినిధి బృందం
- అన్ని రాష్ట్రాల్లో అందోళనలకు పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పుదుచ్చేరిలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఉధృతమైంది. శనివారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, లెఫ్ట్నెంట్ గవర్నర్ నివాసాలతో సహా రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటీకరించే చర్యల్ని వేగవంతం చేయడంతో సెప్టెంబర్ 28 నుంచి అక్కడి విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పలుదఫాలుగా విద్యుత్ సంఘ నేతలతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి, గవర్నర్ నివాసాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సంఘాల నేతలు అంగీకరించారు. ఈ చర్చల సమయంలోనే పోలీసులు ముగ్గురు సంఘ నేతల్ని అరెస్టు చేయడం కోసం రావడంతో ఉద్యోగులు ఎదురుతిరిగారు. వారితో పాటు తమను కూడా అరెస్టులు చేయాలని అక్కడే బైఠాయించారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) ప్రతినిధి బృందం సభ్యులు శైలేంద్రదూబే, పీఎన్ చౌదరి, టీ జయంతి, ఎస్ఎస్ సుబ్రహ్మణ్యమ్ తదితరులు పుదుచ్చేరిలో పర్యటించారు. విద్యుత్ ఉద్యోగుల వీరోచిత పోరాటానికి మద్దతు తెలిపారు. వారు ఒంటరి కాదనీ, దేశంలోని 20 లక్షల మంది ఉద్యోగులు వెంట ఉన్నారని చెప్పారు. పుదుచ్చేరి విద్యుత్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావంగా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి విద్యుత్ ఉద్యోగులు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండివైఖరి వీడాలని హితవు పలికారు.