Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు
- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని స్థానికుల డిమాండ్
- తాడిపర్తిలో అలుముకున్న విషాదఛాయలు
నవతెలంగాణ-యాచారం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యార్థులు ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకెళ్లి చెరువులో మునిగి మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లగూడెం సమీపంలో ఎర్రగుంట చెరువు ఉంది. దీనికి కొంత దూరంలోనే పోగుండ్లు గుట్ట దగ్గర దర్గా ఉంది. గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు కలిసి తమ పిల్లలతో దర్గా సందర్శనకు వెళ్లారు. దంపతులు ఎండీ కాసీం, బిబీ వారి కొడుకు కలేత్ (12) 8వ తరగతి, కూతురు సమ్రీన్ (14) 10వ తరగతి, ఎండీ రజాక్, భార్య ఆస్మకు చెందిన రేహన్ (10) 5వ తరగతి, దంపతులు హుస్సేన్, ఫరానాకు చెందిన కొడుకు ఇమ్రాన్ (09) 4వతరగతి చదువుతున్నారు. ఆదివారం గొల్లగూడెం దగ్గర పొడుగుండ్ల దర్గాను దర్శించుకున్నారు. కుటుంబసభ్యులు అక్కడే ఉన్న సమయంలో పిల్లలు మార్గమధ్యలో ఉన్న ఎర్రగుంట చెరువు వద్దకు వెళ్లి నీళ్లలోకి దిగారు. ఎవ్వరికి ఈత రాకపోవడంతో ముగ్గురు బాలురు, ఒక బాలిక ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. గమనించిన స్థానికులు చెరువులోకి దిగి మృతదేహాల ను వెలికితీశారు. పిల్లల మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు వచ్చి బోరున విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. కొంతమంది స్థానికులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలతో వేచి ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటన రాకపోవడంతో బాధిత కుటుంబాలు ఆవేదన గురై మృతదేహాల పంచనామాను అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, స్థానికులకు తోపులాటతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి రాకపోవడంతో బాధిత కుటుంబాలు అసహనం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సర్దిచెప్పిన పోలీసులు.. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.