Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోంది
- తెలంగాణ లింగాయత్‌లకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి :
- కొకాపేట్ బసవేశ్వర ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు
- సమానత్వం నినాదం ఎత్తింది బసవేశ్వరుడు : శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం లింగాయత్ సమాజాన్ని ఓబీసీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కోకాపేట్లో బసవేశ్వర ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బసవేశ్వరుడు విద్య, సమాజం, సమానత్వం గురించి పోరాటం చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్య పద్ధతిని నేర్పిన గొప్ప వ్యక్తి అని గుర్తుచేశారు. బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా జరపాలని ఎన్ని దరఖాస్తులు పెట్టినా గత పాలకులు పట్టించుకోలేదని ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆయన గొప్పతనాన్ని గుర్తించిందన్నారు. బీబీ పాటిల్ సీఎంని కలవగానే ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి విగ్రహాన్ని పెట్టారని గుర్తు చేశారు. హైస్కూల్ పిల్లల పాఠ్యాంశంలో కూడా బసవేశ్వర గురించి చేర్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం లింగాయత్ సమాజానికి అనేక అవకాశాలు కల్పించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బసవేశ్వరుడికి అభిమానులు ఉన్నారని, బ్రిటిష్ ప్రధాని అక్కడి విగ్రహం ఆవిష్కరించారని గుర్తు చేశారు. అనంతరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కులం, మతం లేదు అందరం సమానమే అని నినదించిన వ్యక్తి బసవేశ్వరుడని గుర్తు చేశారు. ఉపన్యాసాలకు పరిమితం కావొద్దని, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని కుల, మతాలకు అతీతంగా ఉండాలని పిలుపునిచ్చారు. పేదల క్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అందరికీ చేరాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ మల్కాపురం శివకుమార్, టీడీసీ చైర్మెన్ ఉమాకాంత పాటిల్, బసవ సమన్వయ కమిటీ ప్రతినిధులు, లింగాయత్ సమాజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.