Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ మిషన్ భగీరథకు ప్రకటించిన రెగ్యులార్టీ అవార్డును రాష్ట్ర మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ జి. కృపాకర్‌రెడ్డి స్వీకరించారు. ఆదివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర తాగునీటి, పారిశుధ్య శాఖ కార్యదర్శి వినిమహాజన్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల అవాసాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ప్రజల ఇండ్లకు ఉచితంగా క్రమంగా సరఫరా చేస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక స్వచ్చంధ సంస్ధ ద్వారా తనిఖీ చేయించింది. అనంతరం భగీరథ పథకానికి రెగ్యులార్టీ కేటగీరి కింద అవార్డును ఎంపిక చేసింది. అవార్డు స్వీకరించినవారిలో కృపాకర్రెడ్డితోపాటు సీఈలు విజరుప్రకాశ్, చిన్నారెడ్డి, నర్సింగరావు, ఎస్ఈ రాకేశ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ మోడల్‌ను దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో అమలుచేస్తున్నారని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ లేని రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును మరింత సమర్థంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత చేరువచేస్తామని చెప్పారు.