Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం
- డబ్ల్యూఎఫ్టీయూ నిరసన కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందని, ప్రపంచ కార్మిక పోరాటాలకు అండగా నిలుద్దామని పలువురు వక్తలు అన్నారు. సోమవారం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (డబ్ల్యూఎఫ్టీయూ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 'అంతర్జాతీయ యాక్షన్ డే'కు దేశవ్యాప్తంగా పలు కార్మికసంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని నారాయణగూడ చౌరస్తా వద్ద ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐయూటీయూసీ ఆధ్వర్యంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. డబ్య్లూఎఫ్టీయూ 1945లో ఏర్పడి నేటికి 75 ఏండ్లు పూర్తిచేసుకుందని, ప్రపంచ కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతనాల పెంపు, సంక్షేమం, సంఘాల మధ్య ఐక్యతను పెంపొందించడానికి డబ్య్లూఎఫ్టీయూ కృషిచేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కులం, మతం, ప్రాంతం, జాతి పేరుతో కార్మికులపై దాడులు పెరుగుతున్నాయని, వీటన్నింటిని డబ్య్లూఎఫ్టీయూ ఖండిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక వైపు శ్రామికులు, ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటే, మరో వైపు పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద దేశాలు ప్రజల సంపదను లాక్కోవాలని, మార్కెట్లను విభజించి, ఇంధన మార్గాలను జయించాలని చూస్తున్నాయని తెలిపారు. కార్మికవర్గం ఎదుర్కొనే వేతనాలు, పెన్షన్ పెంపు, ఉద్యోగ భద్రత, సరళీకృత ఆర్థిక విధానాలు దుష్ప్రభవాలు, ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్యమైన సమస్యలపై ప్రపంచంలో ఏ దేశంలో సమ్మెలు, ఉద్యమాలు జరిగినా సంఘీభావం తెలుపుతున్నదన్నారు. సార్వత్రిక అంశాలపై కూడా ప్రపంచ ప్రజలకు అండగా నిలుస్తున్నదని తెలిపారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్.బోస్ మాట్లాడుతూ.. దేశంలో ఎనిమిదేండ్లుగా మోడీ సర్కార్ ద్రవ్యోల్బణం పెంచి, అధిక ధరలను నియంత్రించకుండా కార్మికవర్గంపై భారం మోపుతున్నదన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులు నిరంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో, పేదరికాన్ని నిర్మూలించడంలో, కరోనామహమ్మారి, విపత్తులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కార్మికవర్గం మరింత ఐక్యంగా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తిరగబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సుధీర్, ఏఐడీఈఎఫ్ జాతీయ నాయకులు జి.టి.గోపాల్, టీఎంఎస్ఆర్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.రాజ్భట ప్రసంగించారు. సీఐటీయూ ఆఖిల భారత వర్కింగ్ కమిటీ సభ్యులు ఆర్.లక్ష్మయ్య, రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రమ, జె.వెంకటేష్, భూపాల్, ఎం.వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.కోటంరాజు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు నర్సింహ, వెంకటేష్, బెఫీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకట్రామయ్య, జీఐసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వై.సుభ్బారావు, టీఎంఎస్ఆర్యూ రాష్ట్ర అధ్యక్షులు భానుకిరణ్, సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటి సభ్యులు ఎస్ఎస్ఆర్ఏ ప్రసాద్, కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, యాటల సోమన్న, కుమార స్వామి పాల్గొన్నారు.