Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అభినందనలు
- బీజేపీ రాష్ట్ర నేతలది తప్పుడు ప్రచారం
- తప్పుడు లెటర్లు సృష్టించి బురద జల్లే ప్రయత్నం బట్టబయలైంది
- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- అవార్డులు వచ్చిన సందర్భంగా అధికారులకు సన్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితనమే అవార్డులు తెచ్చిపెడుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. రాష్ట్రానికి అవార్డులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు, మిషన్‌భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, పలువురు కలెక్టర్లు, అధికారులను సోమవారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిన మాట ముమ్మాటికి వాస్తవమన్నారు. మిషన్ భగీరథ, పల్లెప్రగతి పథకాల్లో సీఎం ఇచ్చిన ప్రణాళికను అమలు చేసిన అధికారులకు, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్రం ఊరికే అవార్డులివ్వలేదనీ, 150కిపైగా బృందాలు 320 గ్రామాల్లో పర్యటించి అన్నీ నిర్ధారించుకున్న తర్వాతే ఇచ్చిందని తెలిపారు. ఆ పథకానికి నిధులివ్వాలని కేంద్రానికి నిటిఅయోగ్ సిఫారసు చేసినా నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. అయినా, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఊరికీ తాగునీటిని అందించారని తెలిపారు.
రాష్ట్రంలోని 54 లక్షల కుటుంబాలకు తాగునీరు సరఫరా అవుతున్నదంటూ జల్‌జీవన్ శాఖ అధికారి వెబ్సైట్ పెట్టిందని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందని పార్లమెంట్‌లోనూ కేంద్ర మంత్రులు ప్రశంసించిన వీడియోలను ప్రదర్శించారు. బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని అభినందిస్తుంటే రాష్ట్రానికి వచ్చిన అవార్డులపై ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం తప్పుడు లెటర్లు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన ప్రయత్నం బట్టబయలైందన్నారు. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి, అంబేద్కర్‌ను సీఎం కేసీఆర్ ఆదర్శంగా తీసుకుని పల్లెప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారనీ, అన్నదాతల కోసం రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో దేశంలోనే తెలంగాణ గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం అంతే మొత్తంలో కలిపి సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనుల తీరును స్టడీ చేయాలని కేంద్రం అధికారులకు సూచించారు. నరేగా పనుల మీద వందల బృందాలొచ్చి అభినందనలు తెలిపాయన్నారు. కానీ, రాష్ట్ర నేతల ఒత్తిడితో ఈ పనులు చేయొద్దు...ఆ పనులు చేయొద్దు అని కేంద్రం నిధులు విడుదల చేయకుండా మోకాలడ్డుతున్నదని విమర్శించారు.