Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క పైసా ఇవ్వకుండా పచ్చి అబద్ధాలు
- రాష్ట్ర నిధులతోనే మెడికల్ కాలేజీలు
- ఆర్ఎంపీ, పీఎంపీల విషయంలో నా వ్యాఖ్యల వక్రీకరణ
- గవర్నర్ వ్యాఖ్యలు సరికావు: మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర మంత్రిగా ఉంటూ తన హౌదాను మరిచి కిషన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. మెడికల్ కాలేజీల కోసం ప్రతిపాదనలు పంపించినా పట్టించుకోలేదనీ, దేశవ్యాప్తగా 157 మెడికల్ కాలేజీలిచ్చి రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వకుండా బీజేపీ సర్కారు వివక్ష చూపించిందని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి బీజేపీ నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో నిధులు కేటాయించి దశల వారీగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బీజేపీ పనితీరుకు బీబీనగర్ ఎయిమ్స్ ఉదాహరణ అంటూ ఎద్దేవా చేశారు. థియేటర్, సౌకర్యాలు లేక అక్కడ చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భువనగిరి ఆస్పత్రిలో ప్రాక్టికల్స్ అనుమతించామని తెలిపారు. ఒక గవర్నర్, డాక్టర్‌గా తమిళిసై సౌందర రాజన్ మెడికల్ కాలేజీల విషయంలో ట్వీట్ చేసే ముందు సరి చూసుకోవాల్సిందని మంత్రి అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గవర్నర్‌కు పంపిస్తామని తెలిపారు. ఆయుర్వేద మినహా ఆయుష్ విద్యార్థుల విషయంలోనూ కేంద్రం ఉద్యోగాలివ్వొద్దని ఆదేశాలిచ్చిందని తప్పుపట్టారు. కేంద్రమే కాలేజీలకు అనుమతించి, చదువుకున్న తర్వాత ఉద్యోగాలివ్వొద్దని ఆదేశిస్తే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని? ప్రశ్నించారు. అందుకే వారికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ లేఖ రాసినట్టు తెలిపారు.
కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు... 1,200 సీట్లు
ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అదనంగా 1,200 సీట్లు రానున్నాయని తెలిపారు. 70 ఏం్డల సమైక్య పాలనలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే ఏడేండ్లలో 12 ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇందు కోసం ఒక్కో మెడికల్ కాలేజీకి రూ.510 కోట్ల చొప్పున మొత్తం రూ.4,080 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. కొత్త కాలేజీలకు రావడానికి కృషి చేసిన ఉన్నతాధికారులను అభినందించారు. 2014లో ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే ఈ ఏడాది 2,901కి పెరిగాయన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు కలుపుకొని మొత్తం 6,540 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. బీ కేటగిరీ సీట్లలో 85 శాతం స్థానిక రిజర్వేషన్లుతెచ్చుకున్నామన్నారు.
పీజీ సీట్లలో లోకల్ రిజర్వేషన్....పరిశీలన
మెడికల్ పీజీ సీట్లలో స్థానిక రిజర్వేషన్ల కల్పన విషయాన్ని పరిశీలిస్తామని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 650 పడకల ఆస్పత్రి, 30 స్పెషాలిటీ సేవలు ప్రజలకు స్థానికంగానే అందుతాయని తెలిపారు.
నా వ్యాఖ్యలు వక్రీకరించారు
ఆర్ఎంపీ, పీఎంపీలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను కొంత మంది వక్రీకరించేందుకు ప్రయత్నించారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎవరూ ఫిర్యాదు చేయకముందే, అధికారికంగా అనుమతి పొందకుండా వైద్యమందిస్తున్న మెడికల్ ప్రాక్టీషనర్లను కట్టడి చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆస్పత్రుల తనిఖీ అనంతరం మూసివేత, నోటీసుల జారీ, జరిమానాల విధింపు చర్యలు తీసుకున్నామని వివరించారు.