Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ మీటింగ్ పెట్టి చొరవ తీసుకోవాలని జేసీఎల్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతిష్ట ఇండిస్టీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ, యాజమాన్యం, కార్మికులతో జాయింట్ మీటింగ్ పెట్టి సమ్మె విషయంలో జేసీఎల్ చొరవ తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు జాయింట్ లేబర్ కమిషనర్‌కు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ఆధ్వర్యంలో ప్రతిష్ట ఇండిస్టీస్ స్టాఫ్అండ్వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి మల్లేశం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ.. వేతన ఒప్పందం కాలపరిమితి ముగిసినా యాజమాన్యం వేతనాలు పెంచట్లేదని జేసీఎల్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికశాఖ జిల్లా అధికారుల సమక్షంలో 10 నెలల కాలంలో 14 సార్లు చర్చలు జరిగినా పెంపునకు యాజమాన్యం అంగీకరించడం లేదని తెలిపారు. అనివార్య పరిస్థితుల్లో పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్న తీరును వివరించారు. మేనేజ్మెంట్ మొండి వైఖరిని కొనసాగిస్తూ వేతన ఒప్పందానికి ముందుకు రాని పక్షంలో యాదాద్రి జిల్లాతో పాటు పారిశ్రామిక ప్రాంతాలన్నింటిలోనూ వారి సమ్మెకు సంఘీభావంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. దసరా పండుగ తర్వాత చర్చలు జరపడానికి కృషి చేస్తామని జేసీఎల్ హామీ ఇచ్చారు.