Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?
- బదిలీలు, ప్రమోషన్లలో మరీ ఇంత నిర్లక్ష్యమా?
- పేద పిల్లల చదువుల పట్ల చిత్తశుద్ధి లేకపాయె..: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆగ్రహం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు కోరేది ఉపాధ్యాయుల కోసం కాదని పాఠశాలల నిర్వహణ మెరుగుదలకు, అందులో చదివే విద్యార్థుల బాగు కోసమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం, పాఠశాలల సమస్యలను గాలికి వదిలేసినట్లు ఉందని విమర్శించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎస్ యూటీఎఫ్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు చేపడుతామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికే రెండుసార్లు ప్రకటించినా 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్టు ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగం పట్ల పట్టింపు లేని తనం ఇకనైనా వీడాలన్నారు. హెడ్మాస్టర్, సబ్జెక్టు టీచర్ పోస్టులు లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదల పిల్లలు నష్టపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని, ఆలోగా తాత్కాలిక ప్రాతిపదికన సత్వరమే విద్యా వలంటీర్లను నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఉండాలనే విధానం మేరకు పండిట్స్, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్ గ్రేడ్ చేసినప్పటికీ పదోన్నతులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు వాటిని పాఠశాలలకు కేటాయించడం, ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం కానీ చేయలేదన్నారు. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలల పారిశుధ్యం, పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం దాన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అప్పగించి చోద్యం చూస్తుందన్నారు. చాలా పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ లేక అపరిశుభ్ర వాతావరణ నెలకొందన్నారు. పాఠశాలల్లో తక్షణం సర్వీస్ పర్సన్స్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో తొమ్మిందేండ్ల కిందట కొన్ని సంక్షేమ హాస్టల్స్‌ను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేశారని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఆరు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా మంజూరు చేయలేదన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం మంచిదే కానీ నిధులు కేటాయించక పోవడం వల్ల ఎక్కడా పనులు పూర్తి కావడం లేదన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరలేదని తెలిపారు. అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసి మొదటి దశ స్కూల్స్ అన్నింటిలో పనులు పూర్తి చేసి, రెండో దశ పనులు కూడా ప్రారంభించాలన్నారు. విద్యార్థులకు ఇంకా కొన్ని పాఠ్య పుస్తకాలు అందలేదని, యూనిఫామ్ రెండు జతలు ఇవ్వలేదని, పాఠశాలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్ నాలుగు నెలలు గడిచినా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా చొరవ తీసుకొని బడులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, జిల్లా నాయకులు జీవీ నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, షేక్ రంజాన్, బానోత్ మంగీలాల్, రామారావు, సతీష్, నవీన్, వాసం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.