Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ అభివృద్ధితోపాటు ప్రభుత్వంలోనూ కీలకపాత్ర
- ఐదుసార్లు ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా ప్రజలకు సేవ
- సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ మాజీ కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ మరణం వామపక్ష ఉద్యమాలకు, పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేరళలో పార్టీ అభివృద్ధి, నిర్మాణంతోపాటు ప్రభుత్వంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారని చెప్పారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన మరణించడం బాధాకరమని అన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ విప్లవజోహార్లు అర్పించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో బాలకృష్ణన్ సంతాపసభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి తమ్మినేని వీరభద్రం పూలమాలవేసి నివాళులర్పించారు. 'జోహార్ కామ్రేడ్ బాలకృష్ణన్, సాధిస్తాం మీ ఆశయాలను'అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ దేశంలో ఉద్యమాలు బలహీనంగా ఉన్నా మూడు రాష్ట్రాలు కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర కమ్యూనిస్టు ఉద్యమానికి కలికితురాయిలాగా ఉన్నాయ ని వివరించారు. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల బెంగాల్, త్రిపుర రాష్ట్రాలు దెబ్బతిన్నప్పటికీ కేరళలో పార్టీ రెండోసారి అధికారంలో వచ్చిందన్నారు. అక్కడ ఎప్పుడూ ఒకసారి లెఫ్ట్ గెలిస్తే, మరోసారి కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందని చెప్పారు. కానీ 2021 ఎన్నికల్లో రెండోసారి కూడా కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం గెలిచి చరిత్ర సృష్టించిందని అన్నారు. పార్టీ నిర్మాణం బలంగా ఉండడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు, ప్రజాను కూల విధానాలు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అందించడమే దీనికి ముఖ్యమైన కారణమని వివరించారు. ఇటీవల తమ పార్టీ అఖిల భారత మహాసభలు కేరళలోని కన్నూర్‌లో జరిగాయని చెప్పారు. బలమైన ఉద్యమాలకు కేంద్రమైన కన్నూర్ జిల్లాకు నాయకత్వం వహించిన నాయకుడు కొడియేరి బాలకృష్ణన్ అని గుర్తు చేశారు. ఆయన ఆ జిల్లాలో జన్మించడమే కాకుండా ఉద్యమ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారని వివరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని అన్నారు. తలసేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారని చెప్పారు. అక్కడ బీజేపీకి పట్టుందనీ, బాగా ఘర్షణలు జరిగే ప్రాంతమని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంపై క్రూరమైన దాడులు జరిగేవన్నారు. ఆ కాలంలో ఆయన పార్టీ కన్నూర్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారనీ, ఉద్యమాన్ని నిలబెట్టడంలో, ప్రజలతో సంబంధాలు కలిగి ఉండడంలో, ఉద్యమాలు నిర్మించడంలో సమరశీలంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రభుత్వ బాధ్యతల్లో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు హోంమంత్రిగా, ఇతర శాఖలకు మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను కట్టడి చేసేవారని అన్నారు. సీపీఐ(ఎం) కేరళ కార్యదర్శిగా ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించడ ంతోపాటు పొలిట్‌బ్యూరో సభ్యునిగా దేశానికి, పార్టీకి సేవలందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి, డిజి నరసింహారావు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేశ్, ఎస్వి రమ, బుర్రి ప్రసాద్, జె బాబురావుతోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు, ఆ పార్టీ ఏపీ రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు పాల్గొని బాలకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు.