Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా తగ్గనున్న పత్తి దిగుబడి
- నష్టాల్లో రైతన్న
- చేతికి వచ్చిన పత్తీ వర్షార్పణం
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
తెల్లని బంగారానికి కష్టకాలం వచ్చింది.. ఇప్పటికే చాలా రోజులు వర్షాలు లేక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపగా.. ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉన్న కొద్దిపాటి పూత రాలిపోతోంది.. చెట్టుకు ఉన్న కాయలు మురిగిపోతున్నాయి.. మరోవైపు కొద్దోగొప్పో చేతికొచ్చే పత్తి కూడా ఏరే పరిస్థితి లేక వర్షానికి కారిపోతోంది.. ఎడతెరిపి లేని వర్షాలతో పంటలు ఆగం అయ్యాయి. అత్యధికంగా 15 కింటాళ్లకు పైగా రావలసిన దిగుబడి రెండు క్వింటాళ్లు అయినా చేతికి వచ్చే పరిస్థితి లేదు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాధారణంగా ఆరు లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది 8 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. మరో 50 వేల ఎకరాల్లో విత్తనపత్తి సాగు చేశారు. ఇప్పుడు విత్తన పత్తితో పాటు దూది పత్తి రైతులు పూర్తిస్థాయిలో నష్టపోతున్నారు. తెలకపల్లి మండలం తాళ్లపల్లిలో 3వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఏటా 1000 ఎకరాలకు పైగా పత్తి సాగు చేసేవారు. ఈ ఏడాది 250మంది రైతులు 1500 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. నల్ల భూములు కావడం చేత ఒక్కో చెట్టు 200 వరకు కాయలు కాసేది. ఈసారి చెట్టుకు పది కాయలకు మించి లేవు. విత్తనాలు వేసింది మొదలుకొని ఇప్పటిదాకా భారీ వర్షాలతో జిల్లా వణికిపోతుంది. పంట పొలాలు నీట మునిగాయి. ముందుగా వేసిన పత్తి పంట చేతికి వచ్చే దశలో వర్షాలు కుడుస్తుండటం వల్ల కాయలు మురిగిపోతున్నాయి. భారీ వర్షాల వల్ల కాయలు పగిలే అవకాశం లేకపోవడం వల్ల పత్తి కాయలోపలే నల్లగా మారిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల పత్తి రాలిపోయి మట్టిలో కలిసింది. ఇక పూత సైతం రాలిపోతోంది.
భారీ వర్షాల వల్ల పత్తికి తీవ్ర నష్టం కలిగింది. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా రెండు క్వింటాళ్లయినా వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే కొంతమంది రైతులు పత్తి పంటలను తొలగించారు. మరికొంత మంది చేనును పొతం చేయకుండా వదిలేశారు. మొత్తం ఆరు లక్షల ఎకరాల్లో బాగా దిగుబడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిగతా పంటలది అదే పరిస్థితి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పత్తి తర్వాత అత్యధికంగా వరి, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. మొక్కజొన్న పంటలు సైతం వర్షాలకు దెబ్బతిన్నాయి. కూరగాయలు, బత్తాయి, జామ వంటి పండ్ల తోటలకు సైతం నష్టం వాటిలింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పిందే లేదు.. కాయ లేదు
రైతు గొర్ల బాలస్వామి- నడిగడ్డ
నాకున్న నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాను. అధిక వర్షాల వల్ల పిందే లేదు.. కాయ లేదు. పూత రావడమే కనిపించడం లేదు. చెట్టుకు రెండు మూడు కాయలు ఉంటే వర్షాలకు అవి కూడా మునిగిపోతున్నాయి. ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశాలు లేవు.
రైతులను ఆదుకోవాలి
బాల్ రెడ్డి- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు- నాగర్ కర్నూల్
మూడు నెలలుగా వర్షాల వల్ల జిల్లా రైతాంగం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. పరిహారం అందేలా చూడాలి.