Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడతెరిపి ఇవ్వని వర్షం
- నేలవాలిన వరి
- మురిగిపోతున్న పైర్లు
- పొంగిన వాగులు..
- అలుగు పారుతున్న చెరువులు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి ఓ మోస్తరు వాన పడుతోంది. వర్షం వల్ల పండుగ పూట ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పైర్లు నీటిలో మురిగిపోతున్నాయి.. కొద్దిరోజుల్లో చేతికి రావాల్సిన వరి నేలవాలింది. చెరువులు మళ్లీ అలుగు పారుతున్నాయి. కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. వర్షంతోపాటు పిడుగులూ పడి పలువురు ప్రాణం కోల్పోయారు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లి చెరువు తెగి 150 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట నీటిలో కొట్టుకుపోయింది. ఎగువ నుంచి వరద అధికంగా రావడంతో చెరువు నిండి తూముకు సమీపంలో గండి పడింది. గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సత్యశిలారెడ్డిని వెంట తీసుకొని వచ్చారు. నీరు తగ్గిన వెంటనే రింగ్ బండ్ నిర్మాణం చేయాలని, ఆ తర్వాత చెరువు మరమ్మతులకు ప్రతిపాదనలుపంపాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నంచర్ల, మహమ్మదాబాద్, మంగంపేట, గాదిర్యాల్, చౌదర్పల్లి గ్రామాల్లో పల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పంట పొలాల్లో వర్షపునీరు చేరడంతో పల్లి పైరు పైకి తేలింది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు వెల్డండ మండలంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధానిలో లోతట్టు ప్రాంతాలు జలమయం
గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం రాత్రి నుంచి గురువారం అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉండటంతో జనంలో పండుగ జోష్ కనిపించకుండా పోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆయా ప్రాంతాల్లో నివసించే జనం అవస్థలు పడ్డారు. చాలాచోట్ల డ్రైయినేజీ లీక్ అయింది. రోడ్లు చెరువులను తలపించాయి. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
అలుగులు పారుతున్న చెరువులు
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో చెరువులు పూర్తిగా నిండాయి. అలుగులు పారుతూ.. మత్తడి దుంకుతున్నాయి. రాయపోల్ మండల కేంద్రంలో నల్లచెరువు, చిన్న మాసాన్‌పల్లి సింగన చెరువు, కొత్తపల్లి, టెంకంపేట, బేగంపేట, వడ్డేపల్లి తదితర గ్రామాల్లో చెరువులు, కుంటలు ముత్తడి దుంకుతున్నాయి.
యువకులు, పిల్లలు మత్తడి దుంకే నీటి ప్రవాహంలో ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.