Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నీట్ పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపును నిలుపుదల చేయాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 10వ తేదీ సోమవారం వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియను నిలిపి వేయాలని ఉత్వర్వులిచ్చింది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వారికి ఇన్‌సర్వీస్ కోటా ఉంటుందని చెప్పిన వర్సిటీ సీట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి లేదని చెప్పడంపై డాక్టర్ దినేష్ కుమార్ ఇతరులు రిట్లు దాఖలు చేశారు. అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్లను జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుమలతతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. నీట్ పీజీ మెడికల్ సీట్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందనీ, తక్షణమే హైకోర్టు స్పందించాలని పిటిషనర్ల వినతిని ఆమెదించిన ధర్మాసనం మధ్యంతర ఉత్వర్వులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని వర్సిటీనీ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్
ఓయూ పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్ సరఫరా కేసులో నిందితుడైన ఎడ్విన్ న్యూన్స్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత నిరాకరించారు. గోవాకు చెందిన ఎడ్విన్ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఓయూ పోలీసులకు పట్టుబడిన మొదటి నిందితుడి వాంగ్మూలం ప్రకారం ఎడ్విన్‌ను నిందితుడిగా చేర్చడం అన్యాయమనీ, గోవాలో నివాసం కూడా ఉన్న ఎడ్విన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది వాదించారు. బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ న్యాయవాది కోరారు. వాదనల తర్వాత బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.