Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరమ్మతుకు నోచుకోని ట్రాన్స్ఫార్మర్
- మహిళల రాస్తారోకో
నవ తెలంగాణ-మల్హర్రావు
ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నీటి సరఫరా బంద్ అయ్యి.. తాగునీటి కోసం తల్లడిల్లుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో గురువారం ఆందోళన చేశారు. భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం ఇప్పలపల్లిలో వారం రోజులుగా నీటి సరఫరా లేదు. గొంతు తడుపుకోవడానికి నీరు లేదని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దాంతో గురువారం ఇప్పలపల్లి, గొర్రెపల్లి గ్రామాల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఓల్గాల సమ్మక్క, బత్తిని మల్లక్క, దోమల మల్లక్క, కావటి మల్లమ్మ, బండారి కళ, బత్తిని మరియ, దండిగ లస్మమ్మ మాట్లాడారు. వారం రోజులుగా ఇప్పలపల్లి, గొర్రెపల్లిలో తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
మంచినీరు సరఫరా చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి బోరుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ పాడైపోవడంతో నీటి సరఫరా కావడం లేదన్నారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మరమ్మతులు చేయిస్తున్నాం : సరిత, పంచాయతీ కార్యదర్శి
ట్రాన్స్‌ఫార్మర్‌తో పంచాయతీ మోటార్‌తోపాటు, స్థానికంగా నలుగురు రైతుల మోటార్లకు కలిపి విద్యుత్ సరఫరా ఉంది. మూడ్రోజుల కిందట ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో గొర్రెపల్లిలో గ్రామ పంచాయతీ మోటార్ నీటి సరఫరా బంద్ అయింది. విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించాం. రెండ్రోజుల్లో మరమ్మతులు చేపట్టి నీటి సరాఫరాకు చర్యలు తీసుకుంటాం.