Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్పై రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టుగా సీఎం వ్యవహార శైలి ఉందంటూ కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షులు, ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ అస్థిత్వాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో ఆర్థికంగా బలోపేతమయ్యారని పేర్కొన్నారు. తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్కు రుణం తీరిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ పేరు ప్రకటించారని అన్నారు. ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమైన ఆ పదాన్ని చంపేయాలను కుంటున్న హంతకుడని పేర్కొన్నారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదనీ, ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని తెలిపారు. ఈ ప్రాంతంలో పోటీ చేసేందుకు కూడా కేసీఆర్కు అర్హత లేదని హెచ్చరించారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకే బీఆర్ఎస్ ఆ తర్వాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని ఎద్దేవా చేవారు. ఇలాంటి వ్యక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ రాజకీయాల్లో హత్యలు ఉండవనీ, ఆత్మహత్యలేనని పేర్కొన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ నిర్ణయం కూడా అలాంటిదేనని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై శశిథరూర్ పునరాలోచించాలని సూచించారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే జాతీయ పార్టీని ప్రకటించారని విమర్శించారు.
బోగస్ ఓట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి : నిరంజన్
మునుగోడు నియోజకవర్గంలో 25వేల కొత్త ఓట్లు వచ్చాయంటూ ఆ జిల్లా కలెక్టర్ చెబుతున్నారంటే, ముకుమ్మడిగా బోగస్ ఓట్లకు ప్రయత్నం చేయబోతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అనుమానం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సమగ్రంగా విచారించిన తర్వాతనే కొత్త ఓట్ల దరఖాస్తుదారులపై ఆమోదం తెలపాలని కోరారు.