Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా..వారికి సీపీఐ మద్దతిస్తున్నదంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సీపీిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్‌తో కలిసి గురువారం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలను బీజేపీ మక్కికి మక్కి పాలనా వ్యవస్థల్లో జొప్పిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకంటే.. కార్పొరేట్ల ప్రయోజనాలు నేటి పాలకులకు ముఖ్యమైందని ఆరోపించారు. దేశంలోని అన్ని రంగాలను భ్రష్టుపట్టించటమే గాక..చివరకు భారత రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీలను రాజకీయ పావుగా వాడుకుంటున్నదని చెప్పారు.రానున్న రోజుల్లో శ్రీలంకలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితులు తలెత్తక తప్పదని తెలిపారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమేనని చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సహా, విభజన హామీలపై త్వరలో పెద్ద ఎత్తున సీపీిఐ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. కె నారాయణ మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఉంటే..తప్పకుండా వ్యతిరేకించేవారమని తెలిపారు. రుణ యాప్ వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని విమర్శించారు. పిఎఫ్ఐని కూకటివేళ్ళతో పెకిళించామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ప్రజలను హింసిస్తున్న రుణ యాప్ మూలాలను ఎందుకు ఛేదించడం లేదని ప్రశ్నించారు.