Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపక్షాల గొంతు నొక్కేందుకే రాజ్యాంగ సంస్థల వినియోగం
- ప్రగతిశీల శక్తులకు స్నేహ హస్తం
- వామపక్షాలతో కలిసి పోరాటం
- వామపక్షాలతో మంత్రిజగదీశ్ సమన్వయ సమావేశం
నవతెలంగాణ- నల్లగొండ
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల నేతలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ సమగ్రతకు భంగం కలిగే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీని నిలువరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజల మధ్య విచ్ఛిన్నానికి కుట్రలు పన్నుతోందన్నారు. తెలంగాణా సహా బీజేపీయేతర రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి బీజేపీని ఉపేక్షించుకుంటూ పోతే దేశం ప్రమాదపుటంచుకు చేరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని నిలువరించాల్సిన అవసరం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల రూపంలో వచ్చిందన్నారు. అందుకు తోడ్పాటునందించే ప్రగతిశీల శక్తులను కలుపుకొని పోవాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలనే వేదికగా ఎంచుకొని వామపక్షాలతో కలిసి బీజేపీపై పోరాటానికి శ్రీకారం చుట్టామన్నారు. అందుకు అవసరమైన సమన్వయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పై నుంచి మారుమూల గ్రామం వరకు ఈ సమన్వయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్త చర్చలో ఉపఎన్నిక..
సీపీఐ(ఎం)కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
మునుగోడు ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ప్రస్తుతం బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకత ప్రగతిశీల శక్తులపై పడిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మునుగోడులో బీజేపీని ఓడించగల శక్తి సామర్థ్యాలు టీఆర్ఎస్కే ఉన్నందున ఉప ఎన్నికల్లో ఆ పార్టీని బలపరచాలని సీపీఐ(ఎం) నిర్ణయించిందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ దేశానికి ప్రమాదకరం
సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి
బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, అందువల్లే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలిసి పోవాలని నిర్ణయించుకున్నామని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు పేద ప్రజలకు భారంగా సంక్రమించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని జాతీయ స్థాయిలో గుర్తించామన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడటంతో టీఆర్ఎస్తో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పకడ్బందీగా రూపొందించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, భువనగిరి యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సీపీఐ నల్లగొండ, యాదాద్రి జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు, టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.