Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామానికో ఇంచార్జిగా ఎమ్మెల్యే
- వంద ఓట్లకు ఓ బాధ్యుడు
- లంకలపల్లి గ్రామానికి ఇంచార్జి కేసీఆర్
- గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళిక
- నేడు 'కూసుకుంట్ల' పేరు ప్రకటించనున్న టీఆర్ఎస్
- 13న నామినేషన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెేసీఆర్ పక్కా ప్రణాళికలు రూపొందించారు. మునుగోడు నియోజకవర్గంలో గ్రామాలవారీగా వ్యూహాలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రచార యుద్ధరంగంలోకి కారు దూకుంది. స్థానికంగా ఉన్న సామాజిక పరిస్థితులకనుగుణంగా ప్రతి గ్రామానికో ఎమ్మెల్యేను ఇంచార్జిగా నియమించారు. వంద ఓట్లకు ఒక ఇంచార్జి, ఐదువందల ఓట్లకు మరో ఇంచార్జి, మండలాలకు సమన్వయకర్తలను నియమించారు. మంత్రి కేటీఆర్‌కు గట్టుప్పల్ మండలం, హరీశ్‌రావుకు మర్రిగూడ మండలం బాధ్యతలు అప్పగించారు. లంకలపల్లి గ్రామ బాధ్యతలు సీఎం కేసీఆర్ తీసుకున్నారు. అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఒంటేరు ప్రతాపరెడ్డిని స్థానికంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆయా బాధ్యులు వారికి కేటాయించిన గ్రామాలకు బయలుదేరారు. శుక్రవారం నుంచి తమకు అప్పగించిన బాధ్యతల్లో ఉంటారు. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్‌తో కలిసి పార్టీ బాధ్యులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికి వెళ్లి ఓటర్లకు వివరించేందుకు కళా జాతాలను కూడా రంగంలోకి దించుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూనే నిత్యావసర ధరల పెరుగుదల, మోటర్లకు మీటర్లు, తెలంగాణ పట్ల వివక్ష వైఖరిని స్థానిక ఓటర్లకు వివరించానున్నారు. ఎన్నిక ముగిసేవరకు ఆయా గ్రామాల బాధ్యులు స్థానికంగానే ఉండి పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం కృషి చేయాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా అధికార పార్టీ 2600 మందిని రంగంలోకి దించింది. పార్టీ అభ్యర్థిగా కూసుగుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి కెేసీఆర్‌ను శుక్రవారం ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పేరు మార్చిన నేపథ్యంలో 13వ తేదీ నాటికి ఎన్నికల కమిషన్ వద్ద ఆ ప్రక్రియ సజావుగా ముగిస్తే, అదే రోజు కూసుగుంట్ల ప్రభాకర్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తారు. లేకుంటే, టీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగే అవవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.