Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి
- వేర్వేరు చోట్ల ఘటనలు
నవతెలంగాణ-విలేకరులు
దసరా పండుగ పూట ప్రయాణాల్లో.. వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన గుట్టమీద అజరు(22), యానంపల్లి గ్రామానికి చెందిన బంటు సాయిలు(52) ద్విచక్ర వాహనాలతో ఎదురెదురుగా ఢకొన్నారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన డిచ్పల్లి మండలంలోని 44వ జాతీయ రహదారిపై సీఎంసీ మెడికల్ కాలేజ్ వద్ద జరిగింది. అలాగే, వేల్పూర్ మండలంలోని పడిగెల్ వడ్డెర కాలనీకి చెందిన అల్లెపు సురేష్(30) కారులో వెళ్తుండగా.. అంక్సాపూర్ సమీపంలో అదుపుతప్పి మర్రి చెట్టుకు ఢకొన్నాడు. సురేష్ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో నిలిచి ఉన్న డీసీఎంను ఢకొని బాలాజీ(45) మృతిచెందాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మోకాలకుంట గ్రామ సర్పంచ్ గుగులోత్ నరసింహ(42) బుధవారం ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా కొణిజర్ల, తనికెళ్ళ గ్రామాల మధ్య ఆర్టీసి బస్సు ఢకొట్టింది. నరసింహ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహన్ని పోలీసులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ టి.యయాతిరాజ్ తెలిపారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ సందర్శించి నివాళి అర్పించారు.
కూసుమంచి మండల కేంద్రంలో శివాలయానికి వెళ్లే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢకొని సంధ్యాతండాకు చెందిన బానోత్ వీరన్న(45) చనిపోయాడు. ఎస్ఐ సందీప్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అమనగల్ మండలం చింతలపల్లి పరిధిలో కారు- బైక్ ఢకొని ఇద్దరు చనిపోయారు. ఎస్ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ(22) పండుగకు అత్తగారింటికెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో బైక్‌పై మల్లేష్‌ను ఎక్కించుకుని వస్తుండగా తలకొండపల్లి వైపు వెళ్తున్న కారు వీరిని ఢకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ, వెనుక ఉన్న మల్లేశ్ మృతిచెందారు.