Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాలా స్కూళ్లలో కొనసాగుతున్న సివిల్ వర్క్స్
- కొన్ని పాఠశాలల్లో ప్రారంభం కాని పనులు
- టెండర్ల దశలోనే పెయింటింగ్, ఫర్నీచర్, డ్యూయల్ డెస్క్‌ల సరఫరా
- నిధులు రాక కాంట్రాక్టర్ల అవస్థ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మన ఊరు-మనబడి', 'మనబస్తీ-మనబడి' కార్యక్రమం పనులు నత్తనడకన సాగుతున్నాయి. చాలా పాఠశాలల్లో సివిల్ పనులే జరుగుతున్నాయి. పనులు పూర్తయినా కాంట్రాక్టర్లకు నిధులు రాక అవస్థలు పడుతున్నారు.
ఈ కార్యక్రమానికి నిధుల కొరత వెంటాడుతున్నది. కొన్ని స్కూళ్లలో ఇంకా పనులే ప్రారంభం కాకపోవడం గమనార్హం. టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. దీంతో మన ఊరు-మనబడి కార్యక్రమం పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇంకోవైపు పాఠశాలలకు డ్యూయల్ డెస్క్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌కు అవసరమైన సామాగ్రి, పెయింటింగ్, గ్రీన్ చాక్బోర్డు, ప్రిన్సిపాల్, సిబ్బంది ఫర్నీచర్, గ్రంథాలయం ఫర్నీచర్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌కు అవసరమైన సామాగ్రిని రాష్ట్రస్థాయిలోనే ఎంపిక చేసి పంపిస్తారు. అయితే వాటికి సంబంధించిన టెండర్లను హైకోర్టు రద్దు చేసింది. కానీ ఇప్పటి వరకు కొత్త టెండర్లు ఖరారు కాకపోవడం గమనార్హం. అందుకే పాఠశాలలకు పెయింటింగ్, డ్యూయల్ డెస్క్‌లు, ఇతర సామాగ్రి సరఫరా ప్రక్రియం ఇంకా ప్రారంభం కాలేదు.
రాష్ట్రంలో చాలా పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పైకప్పు ఊడి కిందపడిన సంఘటనలున్నాయి. ములుగు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు ఊడి కిందపడడంతో పలువురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఇక మరుగుదొడ్లు, మూత్రశాలల్లేక విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇలా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు అరకొర వసతులతో సతమతమవుతున్నారు.
సకాలంలో పనులు పూర్తయ్యేనా?
ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విద్యాశాఖలో 'మన ఊరు-మనబడి' అనే వినూత్న కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చి ఎనిమిదిన ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తిలో ప్రారంభించారు. అయితే దశల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 26,065 స్కూళ్ల అభివృద్ధికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను తొలి దశలో ఎంపిక చేసింది. ఇందులో 5,399 ప్రాథమిక, 1,009 ప్రాథమికోన్నత, 2,715 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటికోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేసేందుకు సర్కారు ప్రణాళిక రూపొందించింది. పనులన్నీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల భాగస్వామ్యంతో చేపడతారు.
ఎస్ఎంసీ చైర్మెన్, హెడ్మాస్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, సర్పంచ్‌లకు ఉమ్మడి చెక్‌పవర్‌ను అప్పగించింది. ఈ పథకం కింద 12 రకాల అంశాలను పటిష్టపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. దీంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో సకాలంలోనే పనులు పూర్తవుతాయా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిధులను త్వరగా విడుదల చేయాలి : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ పాఠశాలల్లో 'మన ఊరు-మనబడి' కార్యక్రమం పనులను వేసవి సెలవుల్లోనే యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం సగానికొచ్చినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేసి పనులు త్వరగా పూర్తయ్యేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. నిధుల కొరత రాకుండా ప్రభుత్వం చూడాలి. పాఠశాలలకు ఫర్నీచర్, పెయింటింగ్, డ్యూయల్ డెస్క్‌లు వంటివి సరఫరా చేయాలి.
సవరణ అంచనాలు సమర్పించే అవకాశమివ్వాలి : పి రాజభాను చంద్రప్రకాశ్, టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు
ప్రభుత్వ పాఠశాలల్లో 'మన ఊరు-మనబడి' కార్యక్రమం పనుల అవసరాన్ని బట్టి సవరించిన అంచనాలనూ సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి.
ఉపాధి హామీ చట్టం కింద జరిగే కిచెన్షెడ్లు, ప్రహరీగోడ వంటి వాటికి ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేయాలి. విద్యార్థుల సంఖ్య కనుగుణంగా కొత్త తరగతి గదులను నిర్మించాలి. మౌలిక సదుపాయాల్లో భాగం గా ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు, సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేయాలి.