Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ లక్ష్యం 2024 ఎన్నికలు
- బీజేపీని బట్టలిప్పి మార్కెట్లో నిలబెడతాం
- ఆపార్టీ విలువల్లేని రాజకీయాలు చేస్తోంది
- మోహన్ భగవత్‌ను కార్పొరేటర్‌గా పోటీచేసి గెలవమనండి
- పనికిరాని వ్యక్తి మాటలు పట్టించుకోనక్కర్లేదు
- కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు
- కిషన్‌రెడ్డి ఫోన్‌ను ప్రధాని ట్యాప్ చేస్తున్నారు..
- మునుగోడు'కాంట్రాక్టు'ల కోసం ఎన్నిక :కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లక్ష్యం బీజేపీనే అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందనీ, దాన్ని బీఆర్ఎస్తో భర్తీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదనీ, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర చేస్తే బాగుంటుందని చెప్పారు. శుక్రవారంనాడాయన మీడియాతో ఇష్టాగోష్టిగా పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తాయనీ, అన్ని శాఖల అభివృద్ధిపై తాము స్పష్టంగా చెప్పగలమనీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
మతాన్ని రెచ్చగొట్టి, విభజన రాజకీయాలు చేయడమే బీజేపీకి తెలుసని ఎద్దేవా చేశారు. పెరుగుతున్న జనాభాపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్‌ను విలేకరులు ఆయనతో ప్రస్తావించగా... ''ఆయన్ని ముందు దేశంలో ఎక్కడినుంచైనా కార్పొరేటర్‌గా పోటీచేసి గెలవమనండి. పనికిరాని వ్యక్తి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు'' అని ఘాటుగా స్పందించారు. దేశంలో ఇందిరాగాంధీ హవా నడుస్తున్న కాలంలో జనతాపార్టీ ప్రభంజనం రాజకీయాలను మార్చిందనీ, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అలాంటి పాత్రనే పోషిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ కాదు...పండుగ అని నిరూపించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అనీ, దేశంలోని రైతాంగం మొత్తానికి ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా అందించే సత్తా ఆయనకు మాత్రమే ఉందన్నారు. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకొనే తెలివి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. ఏ రంగంలో వారు అభివృద్ధి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూపాయి దిగజారుడును చూస్తేనే కేంద్రంలోని పాలనా వైఫల్యం కనిపిస్తుందన్నారు. మోడీ ఓ ఫెయిల్యూర్ ప్రధాని అనీ, ఆయన జీవిత చరిత్ర రాయాల్సి వస్తే 'అద్వానీ టు అదానీ' అనే ప్రత్యేక చాప్టర్ తప్పకుండా ఉండాలన్నారు. కనీసం మీడియాకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేని అత్యంత బలహీన ప్రధాని మోడీ అని విమర్శించారు. గోల్మాల్ గుజరాత్‌ను ఎండగట్టడమే బీఆర్ఎస్ వ్యూహమని చెప్పారు. ప్రధాని మోడీ 'మన్ కీ బాత్' అంటూ ఆయన చెప్పింది వినమంటారే తప్ప, 'జన్ కీ బాత్' వినరని ఎద్దేవా చేశారు. ఆయన 'ప్రచార మంత్రే' తప్ప ప్రధాని మంత్రికి అర్హతే లేదన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామని మోదీ చెప్పారనీ, కానీ రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారని విమర్శించారు. రూపాయి విలువ నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్ వంటి దేశాల్లో పడిపోవట్లేదనీ, కేవలం ఇండియాలోనే దిగజారడానికి ప్రధాని నరేంద్రమోడీ అసమర్థతే కారణమని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అయితే, ఆగస్టు 15ను కూడా అలాగే ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు. కేవలం ఇక్కడ ముస్లిం రాజు పాలన ఉన్నదనే ఏకైక కారణం వల్లే బీజేపీ రాద్ధాంతం చేస్తుందన్నారు. బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తున్నదనీ, పలు రాష్ట్రాల నుంచి అనేక పార్టీల నేతలు కలిసి పనిచేసేందకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ''తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను అవహేళన చేసినవాళ్లంతా చీకట్లో కలిసిపోయారు. అధికారం, పదవుల కోసం ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదు. మోదీ అండ్ కో వ్యూహాలన్నీ మాకు తెలుసు'' అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వారిపైకి వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నదనీ, తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఒకరిద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఆపార్టీని వీడొచ్చని చెప్పారు. ఆ సమాచారం తమ వద్ద ఉన్నదని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావటానికి 40 ఏండ్లు పట్టిందనీ, తమకు అంత సమయం పట్టకపోవచ్చని అన్నారు. ప్రజలకు ఏం కావాలో అదే బీఆర్ఎస్ అజెండా అని తెలిపారు. పార్టీ పేరులో 'తెలంగాణ' అని తొలగించినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. తెలంగాణకు కేసీఆర్ ప్రత్యామ్నాయ పదం అని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అనే విమర్శను ఆయన కొట్టిపారేశారు.
కిషన్‌రెడ్డి ఫోన్‌ను ప్రధాని ట్యాప్ చేస్తున్నారు..
''రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఉప ఎన్నికలో ఆయన రూ.500 కోట్లు ఖర్చుపెడతానని అమిత్ షాకు మాటిచ్చారు. ఓటుకు రూ.30వేలు ఇచ్చి గెలుస్తాననే ధీమాతో ఆయన ఉన్నారు. కానీ అక్కడ విజయం మాదే. రెండు, మూడు స్థానాల కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి'' అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ''నా ఫోన్ సహా 10వేల మందికి పైగా ఫోన్లలో పెగాసస్ ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ను కూడా ప్రధాని ట్యాప్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం కిషన్‌రెడ్డికి కూడా తెలీదు'' అని అన్నారు.