Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాంతీయ పార్టీలుకు, కాంగ్రెస్‌కు మధ్య చాలా చోట్ల పోటీ
- వామపక్షాలు కీలక పాత్ర పోషించాలి : సురవరం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్నికల తర్వాతే బీజేపీకి ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశముందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ''దేశంలో పరిణామాలు-మేధావుల విశ్లేషణ'' అనే అంశంపై సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఐక్యత సాధ్యం కాకపోవడానికి ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కారణమనీ, దానిపై ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దేవెగౌడ, గుజ్రాల్ ప్రధానులైన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీల ఆర్థిక విధానాల్లో పెద్దగా తేడా లేకపోయినప్పటికీ, పోరాడే అవకాశం ఉంటుందని చెప్పారు. బీజేపీ విధానాలపై సర్వత్రా వ్యతిరేకత వస్తున్నప్పటికీ స్పందన లేదని తెలిపారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు సైతం విమర్శించేందుకు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయంలో వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అన్నంత దేశంలోని పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని తెలిపారు. ఇందుకు వామపక్షాల వైఫల్యమే కారణమనీ, దీన్ని చక్కదిద్దాల్సింది కూడా వారేనని అన్నారు. మార్పు కోసం మేధావుల స్థాయిలో విశాలమైన ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని మీడియాను క్రమక్రమంగా కార్పొరేట్లు వశపర్చుకున్నారని తెలిపారు. ధైర్యంగా వారిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాజ్యాంగం సమర్పించే సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన హెచ్చరికలను పట్టించుకోకపోవడమే నేటి సమస్యలకు కారణమని తెలిపారు. ఎనిమిదేండ్లలో మహిళలపై దాడులు పెరిగాయని చెప్పారు. పని, విద్య, ఆరోగ్య హక్కులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు మాట్లాడుతూ పెట్టుబడిదారీ విధానంతో జరిగే నష్టాలపై ఆయా దేశాలు కండ్లు తెరుస్తున్నా....ఇంకా బీజేపీ అవే విధానాలను పట్టుకుని వేలాడుతున్నదని విమర్శించారు. ప్రపంచ నిరుద్యోగులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ముందుగా సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరముందని తెలిపారు. ఇక మెదడుతో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న మాట్లాడుతూ తమిళనాడు, కేరళలో ప్రత్యామ్నాయ సాహిత్యం, సంస్కృతిపై దష్టి సారించాయని తెలిపారు. తమిళనాడులో రావణబ్రహ్మను, కేరళలో బలిచక్రవర్తి జయంతులను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. అలాంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షించారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ రాజ్యం, మతం, మార్కెట్ ఏకమై దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. పెట్టుబడిదారి విధానం మతాన్ని జోడించుకుందన్నారు. వర్గపోరాటానికి కావాల్సిన సైద్ధాంతిక అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐప్సో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.