Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14వరకు నామినేషన్ల గడువు
- తొలి నామినేషన్ వేసిన వెంకట్‌రెడ్డి
- టీిఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రెండు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల వేడిని రగిలించిన మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నియోజకవర్గంలో చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 14వరకు నామినేషన్లకు గడువు ఉంది. సెలవు దినాల్లో నామినేషన్ వేయడానికి అనుమతి లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాన పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలో శుక్రవారం తొలి నామినేషన్‌ను వెంకట్‌రెడ్డి వేశారు.
ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి విడుదల చేశారు. నియోజకవర్గ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా జగన్నాథరావు విధులు నిర్వహించనున్నారు. ఈనెల 14వరకు ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. 15న నామినేషన్ల పరిశీలన, 17 ఉప సంహరణకు గడువు విధించారు. ఇప్పటివరకు దాదాపు 18 నామినేషన్ పత్రాలను వివిధ పార్టీలకు చెందిన నాయకులు తీసుకెళ్లారు. అందులో 15మంది ఇండిపెండెంట్ కాగా, ముగ్గురు బీఎస్పీ అభ్యర్థులున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినం కాబట్టి నామినేషన్ వేయడానికి లేదు. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. 6న కౌంటింగ్ జరుగుతుందని, 8వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే, నామినేషన్ దాఖలు చేసే తహసీల్దార్ కార్యాలయం నుంచి 100మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ వేయడానికి అభ్యర్థితో కలిసి ఐదుగురు మాత్రమే కార్యాలయంలో వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అభ్యర్థుల వాహనాలకు సమీపంలోనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 1500మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నట్టు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి వాహనం, జీపు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడానికి 48గంటల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో కేసు నమోదు చేయనున్నారు.
తొలినామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి
మొదటి రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి మారం వెంకట్‌రెడ్డి నామినేషన్ వేశారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి 15నిమిషాలు ఆలస్యంగా వెళ్లగా, అధికారులు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే, మొదటి రోజు 50మంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు.
టీిఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల
టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ పార్టీ బీఫామ్‌ను అందజేస్తూ ఎన్నికల ఖర్చు కోసం రూ.40లక్షల చెక్కును ఆయనకు అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతి, బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ప్రకటించాయి. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ బరిలో ఉంటారని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు.
10నుంచి నామినేషన్ల జోరు
సోమవారం నుంచి నామినేషన్ల జోరు పెరగనుంది. ఈనెల 10 బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేసే అవకాశం ఉంది. 11న రెండు సెట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత 14న మరోసారి భారీ జనసమీకరణ చేసి నామినేషన్ వేయనున్నారు.
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రొఫైల్
పేరు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
స్వగ్రామం లింగావారిగూడెం
మండలం నారాయణపురం, యాదాద్రి జిల్లా
తండ్రి జంగారెడ్డి
విద్యార్హత బీఏ, బీఈడీ
భార్య అరుణ
కొడుకు- కోడలు శ్రీనివాస్‌రెడ్డి, స్రవంతి
కూతురు- అల్లుడు రమ్య, శ్యాం సుందర్‌రెడ్డి
2003 నుంచి టీఆర్ఎస్లో క్రీయాశీలక పాత్ర పోషించారు. నాటి నుంచే మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో మహేశ్వరం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందారు. 2014లో మునుగోడు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2018లో తక్కువ మోజార్టీతో ఓటమిచెందారు.