Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెట్రో రైల్ పని వేళల పెంపు
- రాత్రి 11 గంటల దాకా మెట్రో సేవలు
- ఈ నెల 10వ తేదీ నుంచి అందుబాటులోకి కొత్త వేళలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ వాసులకు హైదరాబాద్ మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. మెట్రో రైల్ పని వేళలను మరింతగా పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో విద్యార్థులు, ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉండనుంది. వాస్తవానికి మెట్రో రైళ్ల పని సమయాల్లో స్వల్ప మార్పులు చేస్తే బాగుంటుందని, ముఖ్యంగా రాత్రి వేళ్లలో చివరి ట్రైన్ సమయం పెంచాలని నగరవాసుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై అధికారులూ సానుకూలంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు సర్కారు గ్రీన్ సిగల్ ఇవ్వడంతో మెట్రో పని వెళ్లలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే హైదరాబాద్‌లో మెట్రో సేవలు అందుతున్నాయి. తాజాగా ఈ సమయాన్ని మరో 45 నిమిషాలపాటు పొడిగించారు. దీంతో రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. పొడిగించిన కొత్త పని వేళలు ఈ నెల 10 నుంచి అమలులోకి రానున్నాయి. తాజా నిర్ణయంతో టర్మినల్ స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందనీ, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రో రైలు వేళలు పొడిగించినట్టు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కాగా, ఉదయం వేళలో ఎలాంటి మార్పూ లేదని, ఎప్పటి లాగే 6గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య మూడు కారిడార్లు కలిపి 3.50లక్షలకుపైగా నమోదు అవు తుండగా.. కొద్దిరోజుల కిందట 4లక్షల మైలురాయికి చేరుకుని మెట్రో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
మెట్రో నిర్ణయం.. భారీ ఊరట
ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రోలో ప్రయాణం సురక్షితంగా గ్రేటర్‌వాసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో టీఎస్ఆర్టీసీ అనేకచోట్ల బస్సు సర్వీసులను తగ్గించడం, రాత్రి 9దాటితే చాలా ప్రాంతాల్లో బస్సుల కోసం ప్రజలు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరిగిన ఆర్టీసీ బస్సుల చార్జీలు మెట్రో చార్జీలకు దారిదాపుల్లో ఉండటంతో ప్రయాణికులు మెట్రో రైల్లో ప్రయాణించేం దుకు మొగ్గుచూపుతున్నారు. దానికితోడు తమ గమ్యస్థానానికి అనుకున్న సమయంలో వెళ్తతామనీ, బస్సులో ప్రయాణిస్తే గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తుందని పలువురు భావిస్తున్నారు.