Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
- తాను కాల్చుకున్న వైనం
- తీవ్ర గాయాలు.. 'ఉస్మానియా'కు తరలింపు
నవతెలంగాణ-శంషాబాద్
భర్తతో గొడవపడి ఒంటరిగా ఉంటున్న మహిళను ప్రేమ పేరుతో పరిచయం చేసుకొని తనకు దక్కకపోతే చంపేసి తాను చస్తానని పెట్రోల్ పోసి నిప్పంటించి తాను నిప్పంటించుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం తొండుపల్లికి చెందిన బంటారం మహేష్‌గౌడ్‌కు గండిగూడ గ్రామానికి చెందిన సంధ్యతో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవల కారణంతో ఆమె భర్తపై అలిగి పుట్టింటికి వచ్చింది.
బాధితురాలు ఇంటి సమీపంలోనే ఉంటున్న యువకుడు మహమ్మద్ అల్తాఫ్ ప్రేమ పేరుతో ఆమెతో పరిచయం పెంచుకున్నారు. కాగా, సంధ్య కాపురానికి రావడం లేదని మహేష్ ఆమె దగ్గరికి వచ్చి సముదాయించి, నచ్చజెప్పి తొండుపల్లికి తీసుకువెళ్లాడు. అల్తాఫ్ మాత్రం ఆమెను తన వెంట రావాలని లేకపోతే చంపేస్తానని పలుమార్లు బెదిరించాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమె భర్త మహేష్‌తో మాట్లాడాలని తొండుపల్లి వైన్‌షాప్ కాడికి రావాల్సిందిగా అల్తాఫ్ మహేష్‌కు ఫోన్ చేశాడు. అతను అక్కడికి వెళ్ళగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సంధ్య దగ్గరికి అల్తాఫ్ వచ్చి బెదిరించాడు. తన వెంట రాకపోతే చంపేస్తానంటూ ఆమెపై పెట్రోల్ పోసి తానూ పోసుకొని నిప్పుటించుకున్నాడు. దాంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ రాజ్‌కుమార్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.