Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజక వర్గ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డిని టీఎస్‌యూటీఎఫ్ నిర్ణయించింది. ఆయన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మాణిక్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పాఠశాల విద్యలో 17ఏండ్లుగా పర్యవేక్షణ అధికారులు, ఏడేండ్లుగా పదోన్నతులు లేక, ఖాళీపోస్టులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. పారిశుధ్య నిర్వాహణ పట్టించుకోకుండా పాఠశాలలకు గ్రాంట్లు కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యలపై చర్చించే ప్రాతినిద్యం శాసనమండలిలో పెరగాల్సిన అవసరముందనీ, మాణిక్‌రెడ్డి అభ్యర్ధిత్వం అందుకు ఉపయోగ పడుతున్నదని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఫ్యాకల్టీ కొరత తీవ్రమైన సమస్యగా ఉన్న సందర్భంలో పని చేస్తున్నవారే అదనపు భారాన్ని మోస్తున్నారని చెప్పారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీని నియమించకుండా, అభివృద్ధికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రయివేటు విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రభుత్వమే అనుమతినివ్వడం శోచనీయమన్నారు. మార్చి 2023లో జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం ఉన్న మాణిక్‌రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి మాణిక్‌రెడ్డి పోటీలు ఉంటారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తారని తెలిపారు. వారి గెలుపు అనివార్యమన్నారు. నవంబర్ ఏడు లోపు ఒటరుగా నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాణిక్‌రెడ్డి, సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు ఎ వెంకట్, ఎం రాజశేఖర్‌రెడ్డి, డి సత్యానంద్, జి నాగమణి, రవిప్రకాశ్‌గౌడ్,రాజు, ఎం శ్రీధర్, ఆర్ రంజిత్‌కుమార్, రవికుమార్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.