Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకౌంట్లకు బదిలీ... ఆ తర్వాత ఫ్రీజ్
- గౖౖెడ్లైన్స్ ఇవ్వకుంటా అమలెట్టా
- పౖౖెలెట్ ప్రాజెక్టుగా మునుగోడు...
- పథకానికి, ఎన్నికలకు లింకేంటి?
- గొర్రెల, మేకల వృత్తిదారుల్లో అయోమయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొర్రెల, మేకల వృత్తిదారులకు నగదు బదిలీ సొమ్ము చేతికొచ్చినట్టే వచ్చి బ్యాంకుల్లో ఆగిపోయాయి. లబ్దిదారుల అకౌంట్లకు బదిలీ అయినా ప్రభుత్వం ఆ సొమ్మును ఫ్రీజ్ చేసింది. ఆఘమేఘాల మీద వృత్తిదారుల అకౌంట్లలోకి సొమ్మును బదిలీ చేసి, నిలిపేయడం ద్వారా గొర్రెలెలా కొనుగోలు చేస్తారనేది ప్రశ్న. ఇంతకు ముందు నేరుగా ప్రభుత్వమే మందలను కొనుగోలు చేసి లబ్దిదారులకు అందించింది. పౖౖెలెట్ ప్రాజెక్టుగా నిర్ణయించిన మునుగోడులోని చాలా మంది లబ్దిదారుల అకౌంట్లలోకి పంపింది. ఆ సొమ్మును డ్రా చేసుకుని గొర్రెలు కొందామని పోతే, బ్యాంకుల్లో ఫ్రీజ్ అయినట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఇస్తామంటు న్నారు. అయితే ఇప్పటికీ నగదు బదిలీకి సంబంధించిన గైడ్లైన్స్ రూపొందించలేదు. కానీ ఎన్నికల వేళ మాత్రం 5,800 మంది లబ్దిదారుల అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయి.కోడ్ అమల్లోకి రాక ముందే బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ వల్ల ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని బ్యాంకోళ్లు అంటున్నారు. ఈ పథకానికి, ఎన్నికల కోడ్ లింకేంటని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. నగదు ఫ్రీజ్ కావడానికి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సెలవుల్లో ఉండడమే మరో కారణమని అధికారులు చెబుతున్నారు. గొల్లకుర్మల అకౌంట్లలో సొమ్ము చూపించి, ఇవ్వకుండా వారిని అయోమయానికి గురి చేస్తున్నారు. డబ్బులు ఆపడం ద్వారా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు కొంత ప్రతిబంధకంగా మారనుందని చెబుతున్నారు. మొదటి విడతలో జరిగిన అక్రమాలను ఎండగడుతూనే నగదు బదిలీ కోసం దశల వారీగా ఉద్యమించారు. ఈ పథకంలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గొర్రెలు రీసైక్లింగ్ చేయడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం పెరిగిపోయిందనే విమర్శలొచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన గొర్రెల పంపిణీలో అంతులేని అవినీతి జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. అవినీతికి అలవాటు పడిన కొంతమంది పశుసంవర్థక శాఖ అధికారులు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గొర్రె పిల్లలు, ముసలి గొర్లను పంపిణీ చేశారు. దీని కారణంగా గొల్ల, కురుమలు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది నాయకులు, ఆంధ్రా ప్రాంతానికి చెందిన దళారీలు, డాక్టర్లు లాభపడ్డారనే ఆరోపణలు వినిపించాయి. కొన్నిచోట్ల గొర్రెలు కొనకుండానే కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపారు. కరీంనగర్ జిల్లాలో 519 యూనిట్లు కొనకుండానే కొనుగోలు చేసినట్టు లబ్దిదారుల వద్ద సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో వృత్తిదారులకు నగదు బదిలీ చేస్తే, తమకు నచ్చిన గొర్రెలను కొనుగోలు చేస్తామంటూ దశలవారీగా ఉద్యమించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు బదిలీపై నిర్ణయం తీసు కుంది. ఒక్కొక్కరి అకౌంటుకి రూ 1.58లక్షల చొప్పున బదిలీ అయ్యాయి. కానీ సంబంధిత అకౌం ట్లను ఫ్రీజింగ్ చేయాలని బ్యాంకులకు ఉత్తరాలు అందాయి. దీంతో గొల్లకుర్మలు అయోమయంలో పడ్డారు. నోటికాడికి వచ్చిన బువ్వ ఆగిపోయినట్టు ప్రభుత్వం సొమ్మును నిలిపేసిందంటూ లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రీజ్ను ఎత్తేయాలి
గొల్లకుర్మలు నగదు బదిలీ సొమ్మును ఫ్రీజ్ను ఎత్తేయాలి. వెంటనే డబ్బులు ఇస్తేనే లబ్దిదారులకు ఉపయోగం జరుగుతుంది. డబ్బులు చూపెట్టి మోసం చేయడమే అవుతుంది.దీనికి ఎన్నికలకు కోడ్ వర్తించదు.
- జీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి ఉడుతా రవీందర్