Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తంభాల చుట్టూ కేబుల్ వైర్ల కట్టలు
- మరమ్మతుల సమయంలో లైన్మెన్ల ఇబ్బందులు
- తలెత్తుతున్న కరెంట్ సమస్యలు, షార్ట్ సర్క్యూట్లు
విద్యుత్ స్తంభాలు కేబుల్ వైర్లకు స్థావరంగా మారాయి.. విద్యుత్ వైర్లు కనిపించనంతగా కేబుల్ వైర్లను చుట్టేస్తున్నారు.. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి సర్కిల్, ఆల్విన్ కాలనీ డివిజన్ వీధుల్లో కరెంట్ స్తంభాలపై తెల్లగా మెరిసే సిల్వర్ వైర్లు మాత్రమే కాదు.. నల్లటి కేబుల్ వైర్లు కూడా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ సిల్వర్ వైర్లను కప్పేసినట్టు ఉంటున్నాయి. కరెంటు స్తంభాలే కేబుల్ వైర్లకు స్థావరాలైనట్టు చుట్టలు చుట్టి వాటిని వేలాడదీశారు కేబుల్ ఆపరేటర్లు. దీనివల్ల తరచూ కరెంట్ సమస్యలు, షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల సమయంలో విద్యుత్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
నవతెలంగాణ-కూకట్పల్లి
కరెంటు స్తంభాలపై వైర్లు కనపడకుండా కేబుల్ వైర్లు చుట్టి పెడుతుంటే విద్యుత్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆల్విన్ కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సమస్యలు ఏర్పడినప్పుడు విద్యుత్ సిబ్బంది స్తంభాలపైకి ఎక్కి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో కరెంటు స్తంభాలపై అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్‌వైర్లు తగిలి ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. కరెంట్‌వైర్లు, కేబుల్‌వైర్లు ఇబ్బడి ముబ్బడిగా అల్లుకుపోయి ఉండటంతో గాలి వాన సమయంలో ట్రాన్స్ఫార్మర్లు పేలడమో.. లేక ఇండ్లల్లో షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయినా స్తంభాల నిండా కేబుల్ వైర్లు కడుతున్న వారిపై విద్యుత్ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆల్విన్ కాలనీ వాసులు చెబుతున్నారు. కొన్ని విద్యుత్ స్తంభాలు నివాసాలకు సమీపాన ఉన్నాయి.. ఇలాంటి వాటిపైనా స్తంభం కనిపించకుండా కేబుల్స్ చుట్టి ఉంటున్నాయి. స్తంభాలకు అక్రమంగా కట్టిన కేబుళ్లను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
పరిష్కారం దిశగా అధికారుల ఆలోచన:శరత్ బాబు- ఆల్విన్ కాలనీ ఎలక్ట్రిసిటీ ఏఈ
మరమ్మతుల సమయంలో విద్యుత్ సిబ్బంది స్తంభాలపైకి ఎక్కి దిగేటప్పుడు కేబుల్స్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటి వల్ల కొన్నిసార్లు గాయాలు కూడా అవుతున్నాయి. కేబుల్స్‌ను మా సిబ్బంది చాలాసార్లు తొలగిస్తున్నారు. అయితే, తొలగించిన మరుసటి రోజే మళ్లీ కనబడుతున్నాయి. ఈ సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో కూడా ఉంది. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నారు.
కేబుల్స్ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలి
కేబుల్ ఆపరేటర్లు, ఓనర్లు కేబుల్స్‌ను విద్యుత్ స్తంభాలకు కట్టకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యుత్‌శాఖ పనులకు ఆటంకం కలిగించేలా, ప్రజలకు ఇబ్బంది కలిగేలా స్తంభాలపై కేబుల్స్ కడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గతంలో ఆల్విన్ కాలనీలోనే కేబుల్స్ కారణంగా ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. కాలనీల్లో రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను కేబుల్ సిబ్బంది స్తంభాలపై కేబుల్స్ సరి చేసే క్రమంలో అటూ ఇటూ కదిలించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుచోట్ల సీసీ కెమెరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. అందువల్ల కేబుల్స్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.
- నోముల అంజిరెడ్డి
దీన్ దయాళ్ అసోసియేషన్ అధ్యక్షులుఆల్విన్ కాలనీ ఫేస్-1