Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు సిద్ధాంతం అమలు
- రాజగోపాల్‌రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో
- ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టావ్..
- 11న చండూరులో వామపక్షాల బహిరంగ సభ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తోందని, దాన్ని తెలంగాణలో అడుగుపెట్టనివ్వొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో శనివారం మునుగోడు నియోజకవర్గ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్మీట్లో తమ్మినేని మాట్లాడారు. భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని, హిందూ దేశమంటే మనువాద రాజ్యమనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు డా.బిఆర్.అంబేద్కర్ సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలుపర్చాలనే కుట్ర పెద్దఎత్తున జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గతంలో మన రాజ్యాంగాన్ని చెత్త రాజ్యాంగమంటూ విమర్శించారని గుర్తు చేశారు. బీజేపీ వెనుక భయంకర శక్తిగా ఉన్న ఆర్ఎస్ఎస్ చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోందన్నారు. కుల వ్యవస్థను కాపాడేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాయని విమర్శించారు. హిందూ దేశ ఏర్పాటుకు అవరోధంగా ముగ్గురిని ప్రధాన శత్రువులుగా బీజేపీ భావిస్తోందని, వారే ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు అని చెప్పారు. అందుకే వారిని ఎక్కడికక్కడ అణచేయాలని ఆ పార్టీ తన చర్యలను మొదలు పెట్టిందని వివరించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు.. వాటి విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు నియోజకవర్గంలో పంపిణీ చేయడానికి దాదాపు 50వేల పుస్తకాలు ముద్రిస్తున్నామని చెప్పారు. వాటిని మనమంతా చదవడంతోపాటు ప్రజలను కూడా చదివేలా చేయాలని సూచించారు. బీజేపీ ప్రమాదకర శక్తి అని గ్రహిస్తే.. ఇక దాని అంతు ప్రజలే చూస్తారని అన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, లేకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. కమ్యూనిస్టులది త్యాగాల చరిత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారని గుర్తు చేశారు. ''వ్యాపారాల కోసం అమ్ముడుపోయిన నువ్వా మా గురించి మాట్లాడేది.. కాంట్రాక్టు పనులకు మునుగోడు ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి'' అని విమర్శించారు. ఆయన వ్యాపార అవసరాలు, బీజేపీ రాజకీయ అవసరాల్లో భాగంగానే ఉప ఎన్నిక వచ్చిందని తెలిపారు. బీజేపీ తన ఎజెండాను అమలు చేయడానికి ఆ పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలను ఎంచుకుందన్నారు. బీజేపీ తమ పార్టీకి రాజకీయ శత్రువువని, దానిని ఓడించేందుకు సీఎం కేసీఆర్ కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించామని చెప్పారు. టీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ కలిసి బీజేపీని ఓడిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారన్నారు. అందరూ కలిసి పనిచేస్తే బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందన్నారు. ఈ ఎన్నికతో మన పార్టీ గౌరవం మరింత పెరగాలన్నారు. అత్యంత క్రీయాశీలకంగా పనిచేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వామపక్షాల సత్తా చాటడానికి ఈనెల 11న చండూరు మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సీపీఐ(ఎం), సీపీఐ కలిసి దాదాపు 10వేల మందిని సమీకరించి సభ జరపాలన్నారు. ఈ సభకు రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర, జాతీయ నాయకులు, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈనెల 25 లేదా 26 తేదీల్లో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో బైకు ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఆ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని చెప్పారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. వామపక్షాలు బలపర్చకపోతే విజయం సాధ్యం కాదనే విషయం ఈ ఎన్నికలతో నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఐదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి వామపక్షాల అభ్యర్థి గెలిచిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్ విషప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో మన శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయిలో సీపీఐ(ఎం), సీపీఐ, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కలిసి ఐక్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చెప్పారు.
యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారి అయిలయ్య, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.