Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.56 లక్షల ఎకరాల్లో సాగు
- 6.45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
- 160 కొనుగోలు కేంద్రాల నిర్వాహణ
- 70 లక్షల గన్నీ బ్యాగ్‌లకు అర్డర్
- ప్రతిగింజా కొనుగోలుకు ఏర్పాట్లు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలెట్టింది.. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనాలతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాదికంటే ఈసారి అధికంగా వరి సాగు విస్తీర్ణం ఉండటంతో అందుకు అనుగుణంగా ధాన్యం సేకర ణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. సరిపడా గన్నీ బ్యాగ్‌ల సేకరణ, ధాన్యం నిలువ కోసం గోదాంల కోసం కసరత్తు మొదలుపెట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ వానాకాలంలో సీజన్లో 2 లక్షల 56 వేల 61 ఎకరాల్లో వరి సాగు చేశారు. 6 లక్షల 45 వేల 860 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. రంగారెడ్డి జిల్లాలో లక్ష 24 వేల 861 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఎకరానికి 2.5 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన 3 లక్షల 12వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాలో లక్ష 31 వేల 200 ఎకరాల్లో వరి వేయగా, 3 లక్షల 33 వేల 860 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి రానుంది. ఈ ధాన్యం సేకరణకు అధికారులు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్, మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లు, ఐకేపీల ఆధ్వర్యంలో అవసరమైన చోట 160 కేంద్రాల నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నారు. గత వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో గుర్తించి సంబంధిత గ్రామాల్లో ఈసారి సైతం ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు.
70 లక్షల గన్నీ బ్యాగ్‌ల సేకరణ
ధాన్యం కొనుగోలుకు 70 లక్షల బస్తాలు అవసరమని అధికారుల అంచనా. ఇందులో 30 లక్షల బస్తాలు అందుబాటులో ఉండగా, మరో 40లక్షల బస్తాలు తెప్పించేందుకు ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యే నాటికి ఖాళీ బస్తాలు అందుబాటులో ఉంచడానికి అధికారులు కృషి చేస్తున్నారు. గ్రేడ్ 'ఏ' రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2060, కామన్ రకానికి రూ.2040 చొప్పున చెల్లించనున్నారు. ప్రతి గ్రామంలో రైతులకు అందజేసే టోకెన్ల ఆధారంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనుగోళ్లు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ధాన్యం రక్షణ కోసం ఏర్పాట్లు
వర్షం నుంచి ధాన్యం తడవకుండా కాపాడేందుకు అవసరమైన టార్పాలిన్లు సైతం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ వద్ద 32 వేల టార్పాలిన్లు అందుబాటు లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో 15 వేల టార్పాలిన్లు తెప్పించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్‌కు అందజేసేందుకు సైతం చర్యలు చేపట్టారు. తద్వారా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ స్టాక్ ఉండకుండా ఎప్పటికప్పుడూ రైస్ మిల్లులకు ధాన్యం చేరవేయనున్నారు. అలాగే, రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నాలుగు రోజుల్లోపే బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం:ఛాయాదేవి- పౌర సరఫరాల శాఖ రంగారెడ్డి జిల్లా మేనేజర్
ఈ ఏడాది ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ధాన్యం దిగుబడి రెట్టింపు స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.