Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 శాతం మందికే పాలియేటివ్ కేర్ (ఉపశమన) సేవలు
- 90 శాతం మందివి బాధాకరమైన చావులే
- అవగాహన పెంచుకోవాలంటున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్యాన్సర్ వ్యాధి రావడమే బాధాకరం. అంతకన్నా ఇబ్బంది. ఆ వ్యాధి చికిత్సకు అందక ముదిరిపోవడం. అక్కడ్నుంచి నొప్పితో చావు కోసం ఎదురు చూస్తూ రోజులు గడపాల్సి రావడం రోగులను మరింత కృంగదీస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది కొత్తగా 14 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 75,000 మంది వరకు చిన్నారులుండటం ఆందోళన కలిగిస్తున్నది. చిన్నారుల్లో 75 శాతం మంది కోలుకుంటుండగా 25 శాతం ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఏడాది 10 వేల మంది వరకు రకరకాల క్యాన్సర్లతో మరణిస్తుండగా అందులో ఎక్కువగా నోటి క్యాన్సర్ కేసులుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే క్యాన్సర్ బారిన పడిన చికిత్స చేయడానికన్నా ముదిరిపోయిన దశలో చేరిన వారికి నిరంతరం సూదితో గుచ్చినట్టు నొప్పిగా ఉంటుందనీ, అది భరించ లేకపోతుంటారు. దీనికి తోడు ఒంటరితనం కూడ తోడైతే ఆ నొప్పి మరింత ఎక్కువగా అనిపిస్తుంది.
చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు బాధ లేని మరణాన్ని ఇచ్చేందుకు పాలియేటివ్ కేర్ (ఉపశమన) సేవలు ఉపయోగపడతాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రోగుల కోసం పాలియేటివ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి తోడు స్వచ్ఛంద సంస్థలు తోచిన సేవలు అందిస్తున్నాయి. అయినప్పటికీ మరణానికి చేరువలో ఉన్న వారిలో 10 శాతం మంది మాత్రమే ఆ సేవలను అందుకుంటున్నట్టు సమాచారం. మరో 90 శాతం మంది ఇంటి వద్ద ఉంటూ నొప్పితోనే మరణిస్తున్నట్టు తెలుస్తున్నది. బెడ్లు, సిబ్బంది, సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం అవగాహన లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మరింత అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
5,500 మందికి స్పర్శ్ సేవలు
2011లో స్వచ్ఛంద సంస్థ స్పర్శ్ హాస్పీస్ 5,500 మందికి ఉచిత సేవలందించింది. హైదరాబాద్ ఖాజాగూడలో గల స్పర్శ్ హాస్పీస్లో శనివారం నుంచి ప్రత్యేకంగా 10 పడకలతో పీడియాట్రిక్ వార్డును అందుబాటులోకి తెచ్చారు. శనివారం ప్రపంచ హాస్పీస్, పాలియేటివ్ కేర్ డే సందర్భంగా ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా దీనిని ప్రారంభించి, తన వంతు సహకరాన్ని అందిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదినీ స్పర్శ్ అమ్మలాంటి సేవలనందిస్తున్నదని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలనుకున్నా తాను ముందు వరసలో ఉంటానని తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, స్పర్శ్ సేవలు మరింత విస్తరించాలనీ, అందుకోసం ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రెయిన్బో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ, స్పర్శ్ అవసరాల మేరకు భవిష్యత్తులోనూ తాము సహకరిస్తామని తెలిపారు. లాంగ్ టర్మ్ ట్రస్టీ జగదీశ్ మాట్లాడుతూ స్పర్శ్ సేవలు పూర్తి ఉచితమనీ, అవసరమైన వారు 040-2338 4039, 99635 04253, 79950 27879 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని మూడు నుంచి నాలుగెకరాల స్థలాన్ని కేటాయించాలని కోరామనీ, క్యాన్సర్ రోగులకు ఉచితంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అదే విధంగా ప్రారంభదశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు మొబైల్ వాహనాలను నడుపనున్నట్టు చెప్పారు.
ఆర్థికంగా చితికిపోయాం...లక్ష్మి
తన బాబుకు క్యాన్సర్ సోకడంతో అనేక ఆస్పత్రులు తిరిగి ఆర్థికంగా, ఇతరత్రా పూర్తిగా చితికిపోయామని తెలిపారు. ఈ దశలో స్పర్శ్ హాస్పైస్ తమలో వెలుగు నింపిందని తెలిపారు. గత ఐదారు నెలల నుంచి కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుంటున్నారని తెలిపారు. పలువురు రోగుల బంధువులు తమ అనుభవాలను వివరించారు.